అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సందర్శకులకు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల రిపోర్టులను పరిశీలించి బుధవారం నుంచి వచ్చే నెల 15 వరకు జరిగే ఎగ్జిబిషన్‌కు అనుమతించింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని మొత్తం 9 గేట్లలో మూడింటిని తెరిచి ఉంచాలని, మిగిలినవాటికి తాళాలు వేయకుండా సెక్యూరిటీ సిబ్బందిని కాపలా పెట్టాలని ఆదేశించింది. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోనందునే గత ఏడాది ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశించాలని లాయర్ ఖాజా ఐజాయుద్దీన్ వేసిన పిల్ పై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదిస్తూ.. నుమాయిష్ లోపల బయట కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే నివారించేలా లక్షన్నర లీటర్ల నీటిని నిల్వ చేశామని, ఆ నీటిని దూరంగా ఉండే ప్రాంతానికి వెళ్లేలా పైపులు కూడా వేశామంటూ వాటి ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు. ఎగ్జిబిషన్ సొసైటీ వివిధ శాఖలకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.2 కోట్లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు తెలిపారు. కరెంటు పోతే కేవలం పది సెకన్లలో ఆన్ అయ్యేలా అత్యాధునిక జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. పిటిషనర్ లాయర్ ఖాజా ఐజాయుద్దీన్ వాదిస్తూ. . ఎగ్జిబిషన్ సొసైటీ వెబ్‌సైట్‌లో 2,900 స్టాల్స్ పెడుతున్నట్లుగా ఉందని, అయితే ప్రభుత్వం 1,500 స్టాల్స్‌నే పెడుతున్నట్లుగా చెబుతోందని చెప్పారు. స్పందించిన కోర్టు నుమాయిష్‌లో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, స్టాళ్ల సంఖ్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 6వ తేదీలోపు రిపోర్టివ్వాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీని ఆదేశించింది. ఈ పిల్‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకూ నుమాయిష్‌కు అనుమతి ఇవ్వరాదన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.
