మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు కీలక తీర్పు

మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో సంచలనంగా మారిన మరియమ్మ లాకప్ డెత్ కేసును హైకోర్టు విచారించింది. ఇవాళ ఈ కేసుపై హైకోర్టు తీర్పు నిచ్చింది. మరియమ్మ లాకప్ డెత్ కేసుపై సీబీఐ విచారణ అవసరం లేదని ఏజీ వాదనతో కోర్టు ఏకీభవించింది. మరియమ్మ కేసును సీబీఐకు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపించాలని పేర్కొంది. స్టేట్ బాడీ ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేిసంది. కేసు తొందరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 

అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై పోలీసుల తీరుపై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసు వివరాలు చూస్తే... ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్‌, అతని స్నేహితుడు శంకర్ ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. దీంతో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారించారు. వారిద్దరి వాంగ్మూలం ప్రకారం మరియమ్మను కూడా పోలీసులు తరువాత అదుపులోకి తీసుకున్నారు.

జూన్ 18న ఉదయం 7.45 గంటలకు మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్, ఆయన స్నేహితుడు శంకర్‌లను స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ పూర్తి చేశారు. విచారణలో వెంటనే వారు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి దొంగతనం అయిన సొమ్ము రికవరీ చేశారు. అయితే, మరుసటిరోజు పోలీసు స్టేషన్‌లో మరియమ్మ స్పృహ తప్పింది. వెంటనే ఆమెను భువనగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.