కౌంటర్లు దాఖలు చేయండి..ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశం 

కౌంటర్లు దాఖలు చేయండి..ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్‌‌ వెలువరించిన తీర్పులను రద్దు చేయాలంటూ బీఆర్‌‌ఎస్‌‌ వేసిన పిటిషన్లకు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలను హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఆ తర్వాత వారంలోగా పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్‌‌ 25కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్​రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌‌ రెడ్డి, టి.ప్రకాశ్‌‌ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, ఎం.సంజయ్‌‌ కుమార్‌‌లను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లను స్పీకర్‌‌ కొట్టివేయడాన్ని సవాల్​చేస్తూ బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌‌ రెడ్డి, కేపీ.వివేకానంద, కె.సంజయ్, పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి, సీహెచ్‌‌.ప్రభాకర్, పాడి కౌశిక్‌‌ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం.మొహియుద్దీన్​లతో కూడిన బెంచ్‌‌ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తులు నాలుగు వారాలు గడువు ఇస్తూ విచారణను వాయిదా వేశారు