- గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని అమన్‌గల్ మండలం అమన్‌గల్ వద్ద మీర్‌ఖాన్‌పేట ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు దాకా చేపట్టనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి అవార్డు ప్రకటించేదాకా రైతులను ఖాళీ చేయించరాదంటూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టును ఆశ్రయించిన 30 మందికి చెందిన 61 ఎకరాలకు అవార్డు ప్రకటించేదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
యాచారం మండలం కుర్మిడ గ్రామం, అమన్‌గల్ మండలం అమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల్లో 554.34 ఎకరాల భూసేకరణ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌లను సవాల్ చేస్తూ అన్నేపు జంగయ్య మరో 29 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్ట ప్రకారం చేపట్టడంలేదని తెలిపారు.
అత్యవసర నిబంధనకు సంబంధించి ప్రకటన జారీ చేయలేదని చెప్పారు. అభ్యంతరాలను స్వీకరించలేదని పేర్కొన్నారు. భూసేకరణపై భూయజమానుల వాదనలను వినకుండా ఏకపక్షంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టారని వెల్లడించారు. పిటిషనర్లకు చెందిన 61 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 554.34 ఎకరాలుగాను కేవలం 200 ఎకరాల వరకే వివాదం ఉందన్నారు.
26 ఎకరాలకు ఇప్పటికే పరిహారం మంజూరు చేసినట్టు వివరించారు. భూసేకరణ ప్రక్రియపై ఈ దశలో స్టే ఇవ్వరాదన్నారు. పిటిషనర్లకు పరిహారం చెల్లించాక భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లకు పరిహారం చెల్లించేదాకా వారిని ఖాళీ చేయించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు.
