చట్టవిరుద్ధ నోటిఫికేషన్‌‌ను అనుమతించలేం..  2001 నాటి గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు  

చట్టవిరుద్ధ నోటిఫికేషన్‌‌ను అనుమతించలేం..  2001 నాటి గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు  

హైదరాబాద్, వెలుగు: చట్టబద్ధమైన విధి విధానాలు పాటించకుండా ప్రైవేటు ఆస్తులను వక్ఫ్‌ ఆస్తులుగా ప్రకటిస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 2001లో వక్ఫ్‌బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని వివిధ సర్వే నంబర్లలో తమ భూములను వక్ఫ్‌ ఆస్తులుగా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సయ్యదా గౌసియా సుల్తానా సహా మరో 38 మంది సవాలు చేశారు. దీనిపై జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు.

పిటిషనర్లకు ఓఆర్‌సీలు, పట్టాలు, పాస్‌బుక్‌లు, టైటిల్‌ డీడ్‌లు ఉన్నాయని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను వక్ఫ్‌ ఆస్తులుగా ప్రకటించారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల పత్రాలను ఏ న్యాయస్థానమూ రద్దు చేయలేదని తెలిపారు. ప్రాథమిక ఆధారాలను బట్టి వారు భూములకు చట్టబద్ధమైన యజమానులుగా ఉన్నారని పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు చర్యలతో వారి యాజమాన్య, ఆస్తి బదిలీ హక్కులకు భంగం కలిగిందన్నారు.

జాప్యం జరిగిందన్న కారణంతో పిటిషన్‌ దాఖలు చేసే హక్కు కోల్పోరని స్పష్టం చేశారు. వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించే ముందు చట్టంలోని సెక్షన్‌ 4, 5 ప్రకారం సర్వే నిర్వహించి, విచారణ జరిపి, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోర్టు తెలిపింది. అయితే అలాంటి ప్రక్రియ పాటించినట్లు ఆధారాలను వక్ఫ్‌బోర్డు సమర్పించలేదని పేర్కొంది. 1954 చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేయడమే చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ.. 2001 నాటి గెజిట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.