అంగన్‌వాడీలను క్రమబద్ధీకరించాలి..కాంట్రాక్ట్‌ సర్వీసులు వాడుకొని రెగ్యులరైజ్ చేయబోమంటే ఎట్ల? : హైకోర్టు

అంగన్‌వాడీలను క్రమబద్ధీకరించాలి..కాంట్రాక్ట్‌ సర్వీసులు వాడుకొని రెగ్యులరైజ్ చేయబోమంటే ఎట్ల? : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్‌  పద్ధతిపై ఏళ్ల తరబడి సర్వీసు వాడుకుని పోస్టుల భర్తీ సమయం వచ్చేసరికి రెగ్యులరైజేషన్‌ చేయబోమంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సర్వీసులు వాడుకుని ఉద్యోగాలను క్రమబద్ధీకరించబోమంటే కుదరదని తేల్చి చెప్పింది. సూపర్‌వైజర్‌  గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో అంగన్ వాడీ  కాంట్రాక్ట్‌  ఉద్యోగులకు 15 శాతం వెయిటేజ్‌  మార్కులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తప్పుపట్టింది.

 గతంలో వారంతా రెగ్యులర్‌  పోస్టులకే ఎంపికయ్యారని, అయితే.. అప్పుడు ఉద్యోగ నియామాకాలపై నిషేధం ఉండడంతో కాంట్రాక్ట్‌  పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేసింది. కాంట్రాక్ట్‌  సర్వీసు అందించిన వాళ్లను తాజాగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టింది.రెగ్యులర్‌  నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైనప్పటికీ నియామకాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో వారిని కాంట్రాక్ట్‌  పద్ధతిలో ప్రభుత్వం నియమించిందని గుర్తు చేసింది. 

ఇప్పుడు నిషేధం ఎత్తివేశాక మళ్లీ పరీక్ష రాయాలని చెప్పడం సరికాదని ఆక్షేపించింది. దశాబ్దాలుగా సేవలు అందించిన వారిని విస్మరించి కొత్త నియామకాలు చేపడతామంటే కుదరదని పేర్కొంది. కాంట్రాక్ట్‌  పద్ధతిలో నియమితులైన వారిని క్రమబద్ధీకరించాక ఏమన్నా ఖాళీలు ఉంటే.. తాజాగా నియామకాలు చేపట్టవచ్చని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. 

200 మంది విడివిడిగా పిటిషన్లు

కాంట్రాక్ట్‌  పద్ధతిలో 6 నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించకుండా 2013లో నోటిఫికేషన్‌  జారీ చేయడాన్ని సవాలు చేస్తూ అప్పట్లో దాదాపు 200 మంది విడివిడిగా పిటిషన్లు వేశారు. ఆ నోటిఫికేషన్‌పై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. దీంతో ఇప్పటికీ వారు కాంట్రాక్ట్‌  పద్ధతిలోనే కొనసాగుతున్నారు. తమ సర్వీసును క్రమబద్ధీకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మెదక్‌ జిల్లా సదాశివపేటకు చెందిన మీరా బాయి, తదితరులు మధ్యంతర పిటిషన్‌  వేయగా న్యాయమూర్తి జస్టిస్‌  నగేశ్‌  భీమపాక విచారణ పూర్తి చేసి కీలక తీర్పు చెప్పారు. 

ప్రస్తుతం కాంట్రాక్ట్‌  పద్ధతిన పనిచేస్తున్నవారు అనర్హులని గానీ, వారికి అర్హత లేదని గానీ అధికారులు చెప్పడం లేదన్నారు. గతంలో రెగ్యులర్‌  నియామక ప్రక్రియలోనే ఎంపికైనా నియామకాలపై నిషేధం కారణంగా వాళ్లు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాలు పనిచేశాక తాజాగా ఎంపిక చేస్తామనడం చెల్లదన్నారు.