హైదరాబాద్, వెలుగు: పిల్లల నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులు రాజీ ప్రయత్నాలు చేయకుండా నేరుగా కోర్టులను ఆశ్రయిస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సానుకూల ధోరణితో సమస్యలను పరిష్కరించుకోకుండా.. కేవలం పిల్లలు తమ ఆస్తిని తిరిగిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కోరుతున్న పిటిషన్లు ఎక్కువ అవుతున్నాయని అభిప్రాయపడింది. సూర్యాపేట జిల్లాకు చెందిన వృద్ధురాలు(66 ) కొడుకు తనను పట్టించుకోవడం లేదని, అతని నుంచి ఆస్తిని ఇప్పించాలని అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..తల్లి బాగోగులను కొడుకు పట్టించుకోవడం లేదని తెలిపారు.
ప్రస్తుతం ఆమె తన కూతురు వద్దే ఉంటున్నారని చెప్పారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. "కొడుకు పట్టించుకోవడం లేదని అంటున్నారు సరే. ఒకవేళ కుమార్తె ఒక్కరే ఉంటే ఆమెకు కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది కదా?" అని ప్రశ్నించారు. సాధ్యమైనంత వరకు కుటుంబ పరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పిటిషన్‌పై పూర్తి వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను 15వ తేదీకి వాయిదా వేశారు.
