బండి భగీరథ్కు దక్కని ఊరట.. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేమన్న హైకోర్టు

బండి భగీరథ్కు దక్కని ఊరట.. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేమన్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం సుదీర్ఘంగా వాద ప్రతివాదనల అనంతరం భగీరథ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును గురువారం వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈలోగా, బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. 

పోలీసుల దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరిస్తారని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం కాకుండా, శనివారమే తీర్పు చెప్పాలని కోరితే చూద్దామని పేర్కొంది. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మాధవీదేవి వెల్లడించారు.

వెకేషన్‌ బెంచ్‌ తిరిగి ఈ నెల 21వ తేదీన గురువారం విచారణ చేపడుతుందని, అదే తేదీన ముందస్తు బెయిల్‌ అభ్యర్థనపై తీర్పు వెలువరిస్తామని తొలుత చెప్పింది. భగీరథ్‌ మధ్యంతర, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11.40 గంటల వరకు సుదీర్ఘంగా వాదప్రతివాదనలు జరిగాయి. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నిరంజన్‌ రెడ్డి, పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, బాధితురాలి తరఫున సీనియర్‌ న్యాయవాది పప్పు నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. 

బాధితురాలి కుటుంబంతో పిటిషనర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవని, గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో విబేధాలు వచ్చాయని, డిసెంబర్‌ 31న మరోసారి విభేదించారని, మార్చిలో మరోసారి వచ్చాయని చెబుతున్న బాధితురాలి తల్లి మే 8వ తేదీ వరకు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నిరంజన్‌ రెడ్డి వాదించారు. బాధితురాలు మైనర్‌ అయినప్పటికీ ఇద్దరూ ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నందున ప్రత్యేక పరిస్థితుల్లో పిటిషనర్‌కు రక్షణ కల్పించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.

బాధితురాలు నిర్మల్‌ లో నమోదైన డ్రైవింగ్‌ కేసులో చెప్పిన వయసు ప్రకారం ఇప్పుడు 20 ఏళ్లని, జీహెచ్‌ఎంసీ సర్టిఫికెట్‌లో 2008, పాన్‌ కార్డులోని జనన ధ్రువీకరణ ప్రకారం 2010లో పుట్టినట్లుగా ఉందన్నారు. అరెస్టు కాకుండా రక్షణ కల్పిస్తే తక్షణమే పోలీసుల వద్దకు వెళ్లి కేసు దర్యాప్తునకు సహకరిస్తారని చెప్పారు. 

పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ, పోలీసులు బాధితురాలి వయసు విషయంపై ఆరా తీశారని, జీహెచ్‌ఎంసీ బర్త్‌ సర్టిఫికెట్‌ ప్రకారం ఆమె 12వ తేదీ ఆగస్టు 2008లో పుట్టిందన్నారు. పోలీసులు బాధితురాలి నుంచి 161 స్టేట్‌మెంట్‌ నమోదు చేశాక పిటిషనర్‌పై సెక్షన్లు కొత్తవి చేర్చాల్సి వచ్చిందన్నారు. పోక్సో కేసు పిటిషనర్‌కు వర్తిస్తుందన్నారు.