బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు

బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు
  • మధ్యంతర అభ్యర్థనను కొట్టేసిన హైకోర్టు
  • అసెంబ్లీ సెక్రటరీకి మరోసారి నోటీసులు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల నుంచి తమను అన్యాయంగా సస్పెండ్‌‌ చేశారని, సస్పెన్షన్​పై స్టే ఇవ్వాలన్న బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్యేల రిట్‌‌ పిటిషన్‌‌లోని మధ్యంతర అభ్యర్థనను కొట్టేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌ ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్ కార్యదర్శులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ‘‘సభలో సస్పెన్షన్‌‌ తీర్మానాన్ని ఏ సభ్యుడైన ప్రవేశపెట్టవచ్చు. సభా కార్యక్రమాలకు మెంబర్‌‌ ఎవరైనా ఆటంకం కల్పిస్తే సస్పెండ్‌‌ చేసే అధికారం స్పీకర్‌‌కు ఉంది. స్పీకరే సస్పెండ్‌‌ చేసే సభ్యుల పేర్లు చదవాలని పిటిషనర్లు చెప్పడం సరికాదు. ఒక టీవీ చానల్‌‌లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌‌ ఆధారంగా సభలో ఏం జరిగిందో తేల్చలేం. సభలో జరిగింది రాజ్యాంగ వ్యతిరేఖమో లేదో తేల్చాలంటే పూర్తి రికార్డులను పరిశీలించాల్సి ఉంది”అని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉన్నందునే అసెంబ్లీ సెక్రటరీ, సచివాలయ సెక్రటరీలకు మళ్లీ నోటీసులు ఇస్తున్నామని 
చెప్పింది.

న్యాయ సమీక్షకు వీలు ఉంది..

సభ నుంచి సస్పెండ్‌‌ చేయడం రాజ్యాంగంలోని 340కి వ్యతిరేకమని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ప్రకటించాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌‌ న్యాయవాది డి.ప్రకాశ్​రెడ్డి వాదించారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటేరియట్‌‌ సెక్రటరీలతో తమకు సంబంధం లేదన్నారు. చట్టసభలు తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. స్పందించిన కోర్టు రాజారాంపాల్‌‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టసభలో రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగే నిర్ణయాలపై హైకోర్టు విచారణ చేసి ఉత్తర్వులు జారీ చేయవచ్చని తెలిపింది. ఈ నెల15వ తేదీ వరకే అసెంబ్లీ బడ్జెట్‌‌ సమావేశాలు జరుగుతాయని, సస్పెన్షన్​పై స్టే ఇవ్వాలన్న ముగ్గురు ఎమ్మెల్యేల వినతిని హైకోర్టు కొట్టేసింది. అయితే, సస్పెండ్‌‌ చేసే సభ్యుల పేర్ల గురించి స్పీకర్‌‌ ప్రకటించాలన్న కేసులోని అంశాలపై విచారణ చేస్తామని కోర్టు చెప్పింది. తర్వాత కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.