
తీర్పును వాయిదా వేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
హైదరాబాద్, వెలుగు: ఎర్రమంజిల్ బిల్డింగ్ ను కూల్చవద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారంతో వాదనలు పూర్తయ్యాయి. వాటన్నింటినీ పరిశీలిస్తామని, ఈ మేరకు తీర్పు వాయిదా వేస్తున్నామని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల డివిజన్ బెంచ్ తెలిపింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సర్కారు చెబుతున్నదానికి, మాస్టర్ ప్లాన్‌కూ తేడాలున్నాయి. 2010 నుంచి 2013 మధ్య ఐదు మాస్టర్‌ప్లాన్లు ఉన్నాయని అంటోంది. ఫస్ట్ మాస్టర్ ప్లాన్‌లో హెరిటేజ్ బిల్డింగ్స్‌కు రక్షణ గురించి ఉంది. రెండో ప్లాన్‌లో లేదు. సర్కారేమో అన్ని ప్లాన్లకూ సంబంధం ఉంటుందని చెబుతోంది’’ అని పేర్కొంది.
రాతపూర్వక వాదనలు సమర్పించండి
ఇక బుధవారం కొనసాగిన వాదనల సమయంలోనూ బెంచ్ కొన్ని కామెంట్లు చేసింది. ‘‘వారసత్వ భవనాలకు, పురాతన భవనాలకు తేడా ఏమిటో చెప్పాలి. హెరిటేజ్ యాక్ట్ రూపొందించినా మాస్టర్ ప్లాన్ అమల్లో ఉందని పిటిషనర్లు చెబుతున్నదానికి ఏం జవాబు చెబుతారు..’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు ‘‘సర్కార్ పాలసీ డెసిషన్ తీసుకుంటే.. దాంట్లో న్యాయస్థానం ఎట్లా కల్పించుకుంటుంది? కొత్తగా రాష్ట్రం వస్తే కలల్ని సాకారం చేయడానికి కొత్త అసెంబ్లీ కడితే తప్పేముంది. ఎర్రమంజిల్ భవనం శిథిలావస్థకు చేరింది కదా..” అని పిటిషనర్లనూ ప్రశ్నించింది. మొత్తంగా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరువర్గాలను ఆదేశించి, తీర్పును వాయిదా వేసింది.