హైదరాబాద్, వెలుగు: ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలకు అనుమతుల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లపై వ్యాపార సంస్థలకు ఇచ్చిన అనుమతుల వివరాలను నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీవో నెం.73ను నివేదించాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను ఆదేశించింది.
ఫుట్‌పాత్‌లు ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించిన ప్రజా స్థలాలైన నేపథ్యంలో, వాటిపై వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం చట్టబద్ధమేనా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మెట్రో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలకు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ బి.అఖిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ బుధవారం విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈఎస్‌ఐ ఆస్పత్రి, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. ఆక్రమణలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్‌లు, వాణిజ్య కార్యకలాపాల వల్ల పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దీనిపై మెట్రో రైల్ లిమిటెడ్ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. మెట్రో ప్రాజెక్టులకు ప్రయాణేతర ఆదాయం సమకూర్చుకోవడం, ఆస్తుల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవడం లక్ష్యంగా కొన్ని వాణిజ్య సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే కియోస్క్‌లు, వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పించామని చెప్పారు. పాదచారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు.
విచారణ జులై 17కు వాయిదా..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ సమర్పించిన ఫొటోలను పరిశీలించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఫొటోలను చూస్తే వ్యాపారాలు ఫుట్‌పాత్‌లకు అడ్డంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపైనే వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని హైకోర్టు గతంలో పలుమార్లు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. "సాధారణ పాదచారులు, మెట్రో ప్రయాణికులు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించేలా బహిరంగ ప్రదేశాలైన ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో పరిశీలించాల్సి ఉందన్నారు.
ఈ అనుమతులు ఏ నిబంధనల ప్రకారం జీవో జారీ చేశారో తేల్చుతామన్నారు. జీవో నెం.73ను, అలాగే వివిధ వ్యాపార సంస్థలకు మంజూరు చేసిన అనుమతుల పూర్తి వివరాలను సమర్పించాలని మెట్రో రైల్ అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.
