
కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీశ్
మరోసారి మెన్షన్ చేశారు . కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని.... రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పిటిషన్ లో తెలిపారు హరీశ్ తరపు న్యాయవాదులు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ సందర్బంగా విచారణ జరిపిన హైకోర్టు హరీశ్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సీబీఐ ఎంక్వైరీ ఆపాలంటూ ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని తెలిపింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై ఆదివారం అసెంబ్లీలో 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎన్నో విచారణార్హమైన అంశాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున సీబీఐ ఎంక్వైరీకి అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. గత ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్, కాగ్ రిపోర్ట్లు కూడా గత ప్రభుత్వ పెద్దలను తప్పు పట్టాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే చెప్పింది” అని సీఎం తెలిపారు.