హైదరాబాద్, వెలుగు: అటవీ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అడవుల్లో నివసించే గిరిజనులైనా చెట్లు నరికేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. అటవీ సంరక్షణలో విధులు నిర్వహిస్తున్న అధికారులపై దాడులు చేస్తామని.. చంపేస్తామని హెచ్చరించడం ఎంతమాత్రం సరికాదని పేర్కొంది.
అటవీ అధికారులకు ప్రాణహాని ఉందంటూ జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌ఓ) దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు భద్రత కోరుతూ రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది.
యథాతథస్థితి కొనసాగించాలి..
అన్నపురెడ్డిపల్లి మండలంలోని కంపగూడెం, జానకీపురం గ్రామాలకు చెందిన 62 మందికిపైగా గిరిజనులకు సంబంధించిన భూ వివాదం ఆర్ఎస్ఆర్ కింద పెండింగ్‌లో ఉంది. ఈ భూములపై గతంలో హైకోర్టు యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి వ్యవసాయ భూములు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారంటూ వీరభద్రం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. అటవీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది పూర్ణచందర్‌రావు కౌంటర్ దాఖలు చేశారు. అటవీ అధికారులపై జరుగుతున్న దాడుల విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అనుమతులు లేకుండా కార్యకలాపాలు వద్దు..
న్యాయమూర్తి స్పందిస్తూ.. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు నరకడంతోపాటు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివాదాస్పద భూముల విషయంలో ఇరుపక్షాలు యథాతథస్థితి కొనసాగించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేశారు.
