హైదరాబాద్ లో కేబుల్ వైర్ల తొలగింపుపై ఎయిర్టెల్ దాఖలు పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ ( ఆగస్టు 22 ) మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో జస్టిస్ నగేష్ బీమాపాక సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా కేబుల్ ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. లైసెన్స్ కేబుళ్లు తప్ప మిగతావి ఏవీ ఉండద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్టెల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా రామంతాపూర్ లో ఐదుగురు మరణించిన ఘటనను ప్రస్తావించారు న్యాయమూర్తి. కొడుకు పుట్టినరోజు నాడే తండ్రికి తలకొరివి పెట్టిన ఘటనను గుర్తు చేస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నగేష్.
బర్త్ డే రోజు కేక్ కోయాల్సిన బాలుడు తండ్రికి తలకొరివి పెట్టడం కలిచి వేసిందని అన్నారు.విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు న్యాయమూర్తి. ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రామంతాపూర్ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయిందని.. ఈ దారుణానికి అందరం బాధ్యులమేనా అంటూ ప్రశ్నించారు. సమాజం సిగ్గుతో తలదించుకోవాలంటూ జస్టిస్ నగేష్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి.
►ALSO READ | బెంగళూరు స్టార్టప్ సెన్సేషన్: కుక్క, AIతో వ్యాధులను ఈజీగా తెలుసుకుంటున్నారు...!
వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూళ్లతో కొందరి ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయంటూ వ్యాఖ్యానించారు జస్టిస్ నగేష్. ఒకరినొకరు నిందించుకోకుండా ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేమని.. సులభంగా ఉంటే ప్రజలు ఆచరించరని అన్నారు న్యాయమూర్తి.
స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయమన్న పిటీషనర్ వాదనకు కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారని చురకలాంటించారు జస్టిస్ నగేష్ బీమాపాక. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ అంశంపై తదుపరి విచారణను సోమవారానికి ( ఆగస్టు 25 ) వాయిదా వేసింది కోర్టు.
