
బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీ డాగ్నోసిస్ ప్రమాదకర వ్యాధులను ముందుగానే కనిపెట్టడానికి ఒక కొత్త పద్ధతిని ఉపయోగిస్తోంది. వాసన ద్వారా పసిగట్టే కుక్క ముక్కు శక్తిని, కృత్రిమ మేధస్సు (AI) ఇంకా మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) టెక్నాలజీతో కలిపి వైద్య రంగంలో ఒక వినూత్న మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
డాగ్నోసిస్ ఎలా పనిచేస్తుంది: సాధారణంగా కొన్ని వ్యాధులు మన శరీరంలో కొన్ని మార్పులకు కారణమవుతాయి. ఈ మార్పుల వల్ల కొన్ని అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు (VOCs) మన ఊపిరి, చెమట లేదా మూత్రంలో విడుదలవుతాయి. మనిషికి ఇవి వాసన చూడడం కష్టం, కానీ కుక్కలకు ఈ వాసనలను గుర్తించే శక్తి ఉంటుంది. అయితే డాగ్నోసిస్ దీనిని ఉపయోగించుకొని ఒక ప్రత్యేకమైన సిస్టం రూపొందించింది.
డాగ్‌సెన్స్ (కెనైన్ BCI): ఇది కుక్కకు పెట్టే ఒక రకమైన నాన్-ఇన్వాసివ్ హెడ్‌సెట్. మనిషి ఊపిరి సాంపుల్స్ కుక్క వాసన చూస్తున్నప్పుడు ఈ హెడ్‌సెట్ కుక్క మెదడు నుండి వచ్చే సిగ్నల్స్‌ను తీసుకుంటుంది. కుక్క మెదడు నుండి వచ్చిన సిగ్నల్స్ వాటి ప్రవర్తన, ఇతర సెన్సార్ల డేటాను కలిపి అంచనా వేయడానికి AI ఉపయోగపడుతుంది. ఈ డేటాను బట్టి వ్యాధి ఉందో లేదో అంచనా వేస్తుంది.
డాగ్నోసిస్ అభివృద్ధి చేస్తున్న మల్టీ-క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (MCED) టెస్ట్ చాలా సులభంగా ఉంటుంది. ఒక వ్యక్తి కేవలం 10 నిమిషాల పాటు ఒక మాస్క్‌లోకి ఊపిరి వదలాలి. ఆ తర్వాత ఆ సాంపుల్ డాగ్నోసిస్ ల్యాబ్‌కు పంపి విశ్లేషిస్తారు.
ఈ సంస్థ ప్రకారం మొదట టెస్టింగ్లో 10 రకాల క్యాన్సర్‌లను గుర్తించడంలో దాదాపు 96-98% ఖచ్చితత్వం సాధించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీల కంటే ఈ టెస్ట్ ధర 10 రెట్లు తక్కువ ఉంటుంది. ఊపిరి సాంపుల్ సీల్ చేసి వేరో చోటుకి పంపొచ్చు కాబట్టి ఎక్కడ నుండైనా సాంపుల్స్ తీసుకొని వాటిని ఒకే చోట విశ్లేషించవచ్చు.
►ALSO READ | ఆసుపత్రిలో చేరిన అనిల్-ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఈ విధానం 20 ఏళ్లకు పైగా జరిగిన పరిశోధనలపై ఆధారపడి ఉంది. ఇందుకు కుక్కలకు శిక్షణ ఇవ్వడంలో కూడా ఈ స్టార్టప్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. డాగ్ కెనాల్స్ నుండి లేదా మంచి బ్రీడర్ల నుండి కుక్కలను తీసుకొని వాటికి జాగ్రత్తగా శిక్షణ ఇస్తారు. ఈ కుక్కలు కేవలం టెస్టింగ్ కోసం కాకుండా మనుషుల్లో ఒక్కరిగా ఉంటాయి.
ఈ సంస్థను UC బెర్కిలీలో చదువుకున్న ఆకాష్ కుల్గోడ్ & ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ K9 యూనిట్ కమాండర్ ఇటామర్ బిటాన్ స్థాపించారు. ప్రస్తుతం వీరు భారత దేశంలోని హుబ్బళ్లి వంటి ప్రాంతాల్లోని ఆసుపత్రులతో కలిసి పైలట్ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో వైద్య రంగాన్ని పూర్తిగా మార్చవచ్చని భావిస్తున్నారు.