నా 15 ఏళ్ల  సర్వీసులో ఇన్ని తప్పుడు వివరాలు చూళ్లేదు: న్యాయమూర్తి

నా 15 ఏళ్ల  సర్వీసులో ఇన్ని తప్పుడు వివరాలు చూళ్లేదు: న్యాయమూర్తి
  • తప్పుడు సమాచారంతో తప్పు దోవ పట్టిస్తున్నారు
  • సమ్మె విషయంలో ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారు
  • ఐఏఎస్ స్థాయి అధికారులు ఇచ్చే నివేదిక ఇదేనా?
  • ప్రభుత్వ అధికారులపై హైకోర్టు సీజే మండిపాటు 
  • తదుపరి విచారణ ఈ నెల 11కి వాయిదా

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో గురువారం  విచారణ జరిగింది. విచారణలో భాగంగా   తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన కోర్టు… ప్రభుత్వ అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన  రెండు నివేదికలు వేరుగా ఉండడంతో న్యాయస్థానం మండిపడింది. ఓ ఐఏఎస్‌ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది.

తన 15 ఏళ్ల  సర్వీసులో ఇంత  దారుణంగా  తప్పుడు వివరాలు  సమర్పించిన  ప్రభుత్వ అధికారులను  చూడలేదని సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ కోప్పడ్డారు. తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారా? ఇన్ని తప్పులు జరుగుతున్నా సీఎం, రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నారని సీజే అని ప్రశ్నించారు.  తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జి MDని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో  అర్థం కావటం లేదని సీరియస్ అయ్యారు.

జీహెచ్ఎంసీ,  ఆర్టీసీ,  ఆర్థిక శాఖలు…ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని వ్యాఖ్యానించింది హైకోర్టు. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను ప్రశ్నించింది.  తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.