మిమ్మల్ని చూస్తే మాకే భయమేస్తుంది..కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా?..సిరిసిల్ల కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం

మిమ్మల్ని చూస్తే మాకే భయమేస్తుంది..కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా?..సిరిసిల్ల కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై  తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.  మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవిత పిటిషన్ పై సెప్టెంబర్ 23న విచారణ జరిగింది. విచారణ సందర్బంగా కోర్టుకు హాజరైన కలెక్టర్  సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్ పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  

మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్ట పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.  నష్ట పరిహారం చెల్లించకపోవడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేశారు అధికారులు. కవితపై అక్రమ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, ఎమ్మార్వోకు  కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.  కలెక్టర్ ఆదేశాలతో కవిత పై అక్రమ కేసు నమోదు చేశారు. దీంతో  మరోసారి హైకోర్టును ఆశ్రయించింది కవిత. గతంలో ఇదే పిటిషన్ పై కోర్టుకు హాజరయ్యారు  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.  

ఇవాళ కోర్టులో విచారణ సందర్భంగా.. కలెక్టర్  సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్ పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా.. కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా అంటూ కలెక్టర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కలెక్టర్ ను చూస్తే మాకే భయంగా ఉంది ప్రజలకు  ఎలా సేవా చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు.  గతంలో ఇచ్చిన నష్టపరిహారం తీర్పు యధావిధిగా అమలు చేయాలని  ప్రభుత్వానికి, సీఎస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు.

►ALSO READ | బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ పై ఇటీవలే సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా ప్రోటోకాల్ పాటించకపోవడంపై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. అలాగే భూసేకరణ, పరిహారం చెల్లింపులో ఆలస్యం, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో కలెక్టర్ కు  బెయిలబుల్  వారెంట్ కూడా జారీ చేసింది కోర్టు.