కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు

కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
  • కేబినెట్​ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
  • తదుపరి విచారణ వరకు చర్యలొద్దని ఆదేశం
  • మంత్రివర్గ నిర్ణయాలేమీ రహస్యాలు కాదు
  • వాటిపై న్యాయ సమీక్ష చేసే పవర్​ మాకుంది
  • డాక్యుమెంట్లు ఇవ్వండి.. చట్టబద్ధత తేలుస్తాం
  • కేబినెట్​ నిర్ణయాన్ని సవాల్​ చేయొద్దంటే ఎట్ల?
  • ఈ నెల 11కు విచారణ వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 5,100 రూట్లను ప్రైవేటు సర్వీసులకు అప్పజెప్పాలని ఈ నెల 2న రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి బ్రేక్​ పడింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 11 వరకూ ఆ నిర్ణయంపై స్టే విధిస్తూ శుక్రవారం హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె సమయంలో బస్సు రూట్లను ప్రైవేటుకు అప్పజెప్పాలని కేబినెట్​ నిర్ణయించడంతో అటు ఆర్టీసీ కార్మికుల్లో, ఇటు ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోందని, తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌‌ నిర్ణయంపై న్యాయ సమీక్షకు వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. కేబినెట్‌‌ నిర్ణయాలేమీ రహస్యం కాదని, కోర్టులు ఆదేశిస్తే ప్రభుత్వాలు ఆ నిర్ణయాలను తెలపాల్సిందేనని తేల్చిచెప్పింది. కేబినెట్ నిర్ణయాన్ని సవాల్‌‌ చేస్తూ తెలంగాణ డెమొక్రటిక్‌‌ ఫోరమ్‌‌ కన్వీనర్‌‌ ప్రొఫెసర్‌‌ పి.ఎల్‌‌. విశ్వేశ్వర్‌‌ రావు దాఖలు చేసిన పిల్​ను చీఫ్​ జస్టిస్​ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది.

కార్మికులు సమ్మెలో ఉండగా ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటుకు ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయించడం చెల్లదని పిటిషనర్​ పేర్కొన్నారు. లాభాలు వచ్చే రూట్లలోనే బస్సులు నడిపేందుకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ముందుకు వస్తారని, దీంతో పల్లెలకు  ఆర్టీసీ సేవలు నామమాత్రం అవుతాయని పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదించారు. ఆర్టీసీ సమ్మెను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చే నిర్ణయం తీసుకుందని, తక్షణమే హైకోర్టు స్పందించి కేబినెట్‌‌ నిర్ణయంపై స్టే ఇవ్వాలని ఆయన కోరారు.

చట్టబద్ధతేందో తేలుస్తాం

కేబినెట్​ నిర్ణయం గోప్యమని, ఇది ప్రివిలైజ్‌‌ డాక్యుమెంట్‌‌ అని, దీనిని సవాల్‌‌ చేసే అధికారం పిటిషనర్‌‌కు లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బి.ఎస్‌‌.ప్రసాద్‌‌ వాదించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో సర్కార్‌‌ ఉందని, దీనిని అడ్డుకోవడం ప్రజావ్యతిరేకమని, అయినా కేబినెట్​ తీసుకునే నిర్ణయాన్ని సవాల్‌‌ చేయడానికి వీల్లేదన్నారు. కేబినెట్​ నిర్ణయానికి  సంబంధించిన డాక్యుమెంట్స్​ను హైకోర్టుకు ఇవ్వలేమని చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘన ఉన్నప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకునే వీలుంటుందని ఆయన అన్నారు. దీనిపై డివిజన్‌‌ బెంచ్‌‌ స్పందిస్తూ.. కేబినెట్​ నిర్ణయాన్ని సవాల్‌‌ చేయడానికి అధికారం లేదనడం సరికాదని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలందరికీ ఉంటుందని, అయితే ఆ ప్రశ్న చట్టబద్ధమో కాదో రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టులు తేలుస్తాయని పేర్కొంది.

ఏజీ వాదనపై బెంచ్‌‌ విస్మయం వ్యక్తం చేసింది. కేబినెట్​ నిర్ణయం రహస్య పత్రమేమీ కాదని, దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎందుకు రహస్యంగా ఉంచారని ఏజీని ప్రశ్నించింది. కేబినెట్​ నిర్ణయాలను ప్రజలకు కూడా చెప్పాలని తెలిపింది. కేబినెట్​ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉందని తేల్చిచెప్పింది. పిల్‌‌ వేసే అధికారం లేదన్న ఏజీ వాదనను తప్పుపట్టింది. ఒకసారి పిల్‌‌ వేశాక దాన్ని వెనక్కి తీసుకునే అధికారం పిటిషనర్‌‌కు కూడా లేదని, ప్రజాహితం కోరే పిల్‌‌ వేస్తారని డివిజన్​ బెంచ్​ స్పష్టం చేసింది. పిల్‌‌పై తమకు కూడా అభ్యంతరాలు ఉన్నాయని ఆర్టీసీ మేనేజ్​మెంట్​ తరఫున అదనపు ఏజీ జె.రామచందర్‌‌రావు అన్నారు. అయితే.. పిల్‌‌పై పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆయనను డివిజన్‌‌ బెంచ్‌‌  ఆదేశించింది. ‘‘కేబినెట్​ నిర్ణయాన్ని పిల్​లో పిటిషనర్‌‌ సవాల్‌‌ చేశారు.

అయితే కేబినెట్​ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాలు పిటిషనర్‌‌కు అందుబాటులో లేవు. ప్రజలకు కూడా అందలేదు. కేబినెట్​ నిర్ణయానికి సంబంధించిన పత్రాలను కోర్టుకు నివేదించాలి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేబినెట్​ తీసుకున్న నిర్ణయానికి ఉన్న చట్టబద్ధత ఏమిటో తాము విచారించి నిర్ణయిస్తామని, కేబినెట్​ నిర్ణయ డాక్యుమెంట్స్‌‌ అందజేస్తే తేలుస్తామని స్పష్టం చేసింది. అడ్వకేట్‌‌ జనరల్‌‌ వాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. తదుపరి విచారణ జరిగేనాటికి కేబినెట్​ నిర్ణయానికి సంబంధించిన డాక్యుమెంట్స్​ అందజేయాలని ఆదేశించింది.

ఇలాంటి టైమ్​లో చేస్తారా?

‘‘ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. సమ్మెకు చట్టబద్ధతపైన, సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరడంపైన పలు ప్రజాహిత వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల నడుమ ఆర్టీసీలోని  5,100 రూట్లను ప్రైవేటు ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయం తీసుకోవడం కార్మిక సంఘాల్లోనూ కాకుండా ప్రజల్లోనూ మరింతగా ఆందోళనకు గురిచేసింది” అని డివిజన్​ బెంచ్​ వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలో తాము ఆదేశాలు వెలువరించే వరకు కేబినెట్​ నిర్ణయం అమలు చేయొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల  11కు వాయిదా వేసింది.