హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని పేవ్‌మెంట్స్, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని, రోడ్డు పక్కన పార్కింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణల తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలని, మరోసారి ఆక్రమణలకు ఆస్కారం ఇవ్వరాదని సూచించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులను వెలువరించారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణ కేంద్రాల్లో రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన బి. సురేందర్ సహా ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. రోడ్ల పరిస్థితులు సరిగ్గా లేని పరిస్థితుల్లో ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్ల ఆక్రమణలతోపాటు చెత్తతో కూడా తీవ్ర సమస్యలు వస్తున్నాయని న్యాయవాది చెప్పారు. దీనికితోడు రోడ్డు పక్కనే కార్లు, బైక్‌లను పార్కింగ్ చేయడంతో రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు.
షాపుల వాళ్లు కూడా ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నారని, దుకాణాలు ఏర్పాటు చేశారని, విక్రయదారులను తొలగించాలని కోరారు. ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్స్ నిర్వహణ వ్యవహారంపై హైడ్రా సహకారంతో చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ స్పందిస్తూ.. గత ఫిబ్రవరిలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఫుట్‌పాత్‌ల అక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. ఆక్రమణల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ పార్కింగ్ కూడా పెద్ద సమస్యగా మారినందున దీనిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
