హాస్పిటళ్లు హౌస్​ఫుల్

హాస్పిటళ్లు హౌస్​ఫుల్

గతంలో ఎన్నడూ లేనట్టుగా కొద్ది రోజులుగా కాంబినేషన్‌ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్లు ఇది మామూలే అని చెప్తున్నా.. పేషెంట్లు మాత్రం భయపడుతున్నారు. డెంగీ ఉన్న పేషెంట్లకు చికెన్‌ గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ వంటి ఇతర జ్వరాలు కలిసి వస్తున్నాయి. ఒక్కసారి ఇలాంటి జ్వరాల బారిన పడితే కోలుకోవడానికి పదిహేను, ఇరవై రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోంది. సాధారణ జ్వరం వచ్చినా వారు కూడా కోలుకోవడానికి నాలుగు రోజుల నుంచి వారం రోజులు పడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా ఇలాంటి పేషెంట్లే కనిపిస్తున్నారు.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో హాస్పిటళ్లన్నీ హౌస్​ఫుల్‌‌‌‌ అయ్యాయి. జ్వరాలతో బాధపడుతున్న పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. క్లినిక్‌‌‌‌లలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వార్డుల్లోని బెడ్లు సరిపోక కారిడార్లు, స్టోర్‌‌‌‌ రూమ్​లలో కూడా బెడ్లు, బెంచీలు వేసి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించాల్సి వస్తోంది. ఊళ్లలోని పీహెచ్‌‌‌‌సీలు మొదలుకొని హైదరాబాద్‌‌‌‌లోని కార్పొరేట్‌‌‌‌ హాస్పిటళ్ల దాకా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లినా బెడ్లు లేవంటూ తిప్పి పంపుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం మీదికి వస్తే తప్ప బెడ్లు అలాట్‌‌‌‌ చేయడం లేదని అంటున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌‌‌‌, చికెన్‌‌‌‌ గున్యాతోపాటు రకరకాల వైరల్‌‌‌‌ ఫీవర్లు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. వానలు పడుతూ వాతావరణం మారిపోవడంతో రాష్ట్రం మొత్తం మంచం పట్టినట్లు తయారైంది. అప్రకటిత హెల్త్‌‌‌‌ ఎమర్జెన్సీని తలపిస్తోంది.

40 లక్షల మందికి వైరల్​ ఫీవర్స్!​

రాష్ట్రంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌‌‌‌, చికెన్‌‌‌‌ గున్యా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా డెంగీ డేంజర్‌‌‌‌ బెల్స్‌‌‌‌ మోగిస్తోంది. ప్లేట్‌‌‌‌లెట్‌‌‌‌ల కౌంట్‌‌‌‌ పడిపోతోందని జనం భయపడిపోతున్నారు. జ్వరంగా అనిపిస్తే చాలు దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. విష జ్వరాలతో కొందరు మృత్యువాత పడుతుండడంతో మరింత అప్రమత్తమవుతున్నారు. రాష్ట్రంలో కేవలం డెంగీతోనే ఇప్పటి వరకు 46 మంది చనిపోయినట్లు అంచనా. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటిదాకా సుమారు 40 లక్షల మంది వైరల్‌‌‌‌ ఫీవర్ల బారిన పడినట్లు అధికార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో రోజూ రెండున్నర లక్షల దాకా ఓపీ సంఖ్య నమోదవుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ హాస్పిటల్‌‌‌‌కి రోజూ రెండున్నర వేల నుంచి మూడు వేల మంది ఓపీకి వస్తే అందులో వెయ్యి మందికి పైగా జ్వరాల బాధితులేనని డాక్టర్లు చెప్తున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో సాధారణ రోజుల్లో రోజుకు 150 వరకు ఔట్​ పేషెంట్ల సంఖ్య ఉంటే ప్రస్తుతం అది మూడు, నాలుగు వందల వరకు ఉంటోంది. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. పల్లెల్లో బాధితుల అవస్థలు చెప్పనలవిగాని విధంగా ఉన్నాయి. పీహెచ్‌‌‌‌సీలన్నీ హౌస్​ఫుల్​ కావడంతో..  సరైన వైద్యం అందక పలువురు మృత్యువాత పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రానికి రావొద్దు..!

రాష్ట్రంలో ఆందోళ కలిగించే స్థాయిలో విష జ్వరాలు ఉండడంతో విదేశాల నుంచి వచ్చే తమ వారిని వద్దని బంధువులు వారిస్తున్నారు. రాష్ట్రమంతా జ్వరాలు వ్యాపించి ఉన్నాయని, వానలు పడుతున్నాయని, వెదర్‌‌‌‌ పాడైపోయిందని చెప్తున్నారు. సాధారణంగా ఈ సీజన్‌‌‌‌లో కూల్‌‌‌‌ వెదర్‌‌‌‌ ఉంటుందని అమెరికా, యూకే తదితర దేశాల్లోని ఇక్కడివారు చాలా మంది అనుకుంటారు. వైరల్‌‌‌‌ ఫీవర్ల కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రావొద్దని వారికి వారి తల్లిదండ్రులు, బంధువులు సూచిస్తున్నారు. చివరకు బెంగుళూరు, చెన్నైలో ఉండే వారిని కూడా  హైదరాబాద్‌‌‌‌కు రావొద్దని చెప్తున్నారు. చాలా మంది బయటి నుంచి వచ్చిన వాళ్లు.. ప్రస్తుతం మారిపోయిన వాతావరణానికి ఒకటి రెండు రోజుల్లోనే సిక్‌‌‌‌ అవుతున్నారు. ఒక వెదర్‌‌‌‌ కండీషన్‌‌‌‌ నుంచి మరో వెదర్‌‌‌‌ కండీషన్‌‌‌‌కు వాళ్లు మారడంతో
తొందరగా జ్వరాల బారిన పడుతారని డాక్టర్లు కూడా చెప్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న బెడ్ల కొరత

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటళ్లలో లక్షకు పైగా బెడ్లు ఉన్నాయి. గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటళ్లలో 30వేల బెడ్లు ఉన్నాయి. జ్వరాల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య 40 లక్షల వరకు ఉంటోందని, వీరిలో కనీసం పది లక్షల మందికైనా హాస్పిటళ్లలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని హైదరాబాద్‌‌‌‌లోని కార్పొరేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు చెందిన సీనియర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ ఒకరు తెలిపారు. చిన్న చిన్న క్లినిక్‌‌‌‌లలోని ఒకటీరెండు బెడ్లను కలుపుకున్నా రాష్ట్రంలో రెండున్నర లక్షలకు మించి బెడ్లు ఉండవని ఆయన అన్నారు. దీంతో బెడ్లు సరిపోక జ్వర బాధితులకు కేవలం మందులు ఇచ్చి.. నిర్ధాక్షిణ్యంగా వెనక్కు పంపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. సీజన్‌‌‌‌కు ముందే దోమల నివారణ చర్యలు, జనంలో అవేర్‌‌‌‌నెస్‌‌‌‌  తెచ్చేలా ప్రచారం చేస్తే పరిస్థితి ఇంతలా ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హాస్పిటళ్లలో పెద్దగా రష్‌‌‌‌ లేనప్పుడు.. 80 వేలు, లక్ష వరకు ప్లేట్‌‌‌‌ లెట్లు ఉన్న వారిని వెంటనే హాస్పిటళ్లలో చేరాలని డాక్టర్లు సూచించే వారు. ప్లేట్‌‌‌‌ లెట్లు వెంటనే ఎక్కించాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు 50 వేల ప్లేట్‌‌‌‌లెట్లు ఉన్నా హాస్పిటల్‌‌‌‌లో చేర్చుకోలేని పరిస్థితి. కొన్ని హాస్పిటళ్లలోనైతే.. 25 వేల ప్లేట్‌‌‌‌ లెట్లు ఉన్న పేషంట్లను కూడా చేర్చుకోవడం లేదు. ఎవరైనా గొడవ పడితే బెడ్లు లేవని, సిబ్బంది సరిపోవడం లేదని తేల్చిచెప్పేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌‌‌‌వో  లెక్కల ప్రకారం ప్లేట్‌‌‌‌లెట్లు 15 వేలకు పడిపోతే ప్రమాదకరంగా భావిస్తారు. ఆరోగ్యవంతుల్లో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకు ప్లేట్‌‌‌‌లెట్లు ఉంటాయి.

పెరుగుతున్న కేసులు

ఈ ఏడాది జూన్‌‌‌‌ వరకు సాధారణ రోజుల్లో నమోదయ్యేంత సంఖ్యలోనే జర్వాల కేసులు ఉండేవి. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటి సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. జూన్‌‌‌‌ చివరి నాటికి 568 మలేరియా కేసులు రికార్డు కాగా ప్రస్తుతం ఈ సంఖ్య మూడున్నర వేలకు చేరుకుంది. అవి అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ప్రైవేటు హాస్పిటళ్లకు వచ్చే కేసులు, క్లినిక్‌‌‌‌లలో జరిగే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కేసులు తీసుకుంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. మలేరియా 2015లో ఇంతే తీవ్రంగా కనిపించింది. ఆ ఏడాది 11,880 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఈ సంఖ్య 1,792 మాత్రమే. ప్రస్తుతం డెంగీ కేసులు 6,158, చికెన్‌‌‌‌ గున్యా  కేసులు 414 నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది వేల రక్త విరేచనాల కేసులు, మూడు లక్షల విరేచనాల కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న వానలతో వివిధ రకాల వైరల్‌‌‌‌ ఫీవర్లు, డయేరియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అంచనా వేస్తోంది.