- కేటగిరీ, అసెంబ్లీ నియోజకవర్గం మార్పునకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: క్యూర్ ప్రాంతంలోని ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల దరఖాస్తుదారులకు హౌసింగ్ బోర్డు మరో అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో సవరణలు, క్లెయిమ్‌ల సమర్పణకు ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ గురువారం తెలిపారు. దరఖాస్తుదారులు https://tghb.telangana.gov.in/cure-status పోర్టల్ ద్వారా క్లెయిమ్‌లు సమర్పించాలని సూచించారు.
దరఖాస్తులో అసెంబ్లీ నియోజకవర్గం తప్పుగా నమోదైనా, ‘ఔట్ ఆఫ్ కానిస్టిట్యూయెన్సీ’గా తిరస్కరించినా.. సరైన నియోజకవర్గాన్ని పేర్కొంటూ చెల్లుబాటు అయ్యే నివాస ధ్రువీకరణ పత్రంతో క్లెయిమ్ చేయవచ్చన్నారు. అర్హత, తిరస్కరణకు సంబంధించిన అభ్యంతరాలతోపాటు విద్యుత్ బిల్లులు, వాటర్ బోర్డు రికార్డులు వంటి ఆధారాలను సమర్పించవచ్చని తెలిపారు.
