నిమ్జ్ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వండి

నిమ్జ్ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వండి
  • భూమి కోల్పోయిన రైతులు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలి
  • సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి: మంత్రి కేటీఆర్

సంగారెడ్డి జిల్లా: రక్షణ రంగ సంస్థలకు తెలంగాణ హబ్ లాంటిదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిమ్జ్ భూముల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలివ్వాలని ఆయన కోరారు. భూమి కోల్పోయిన రైతులు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని  మంత్రి కేటీఆర్ కోరారు. జహీరాబాద్ లోని నిమ్జ్లో తొలి పరిశ్రమ ‘వెమ్’ టెక్నాలజీ ప్రాజెక్టుకు ఐటీ మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ప్రిన్సిపల్  సెక్రటరీ జయేష్ రంజన్, వెమ్ టెక్నాలజీ సీఎండీ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 1988లో వెమ్ టెక్ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో  అగ్రగామిగా మారిందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మన దేశంలోనే రక్షణ రంగ పరికరాలు తయారీ.. దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తాయన్నారు. 
మీరు కోరిన విధంగా భూములిచ్చాం.. స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించండి
పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వెమ్ టెక్నాలజీ వారి నుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..’ మీరు కోరుకున్న విధంగా భూమి ఇచ్చాము..సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్  వారికి ఇవ్వాలి... జవాబుదారీగా ఉంటూ.. పర్యావరణ హితంగా నిర్వహించాలి.. ’ అన్నారు. 12600 ఎకరాలు భూమి నిమ్జ్ కు కేటాహిస్తే ఇప్పటికి 3500 ఎకరాలే సేకరించామన్నారు. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు 50 శాతం సహకారం అందిస్తామని సీఎండీ వెంకట్ రాజు చెప్పడం అభినందనీయమన్నారు. రక్షణ రంగ సంస్థలకు తెలంగాణ హబ్ లా ఉంది.. అయితే కేంద్రం ఈ విషయాలు పట్టించుకోకుండా బుందేల్ ఖండ్ కు రక్షణ పరిశ్రమల తరలించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలోపు అంటే 2024లోగా వెమ్ టెక్నాలజీని  ప్రారంభం చేయాలని కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.