- మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
- రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశం
వనపర్తి టౌన్, వెలుగు: మహిళ మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం, మృతురాలి భర్తకు ప్రభుత్వ జాబ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గురువారం ఆదేశించారు. వనపర్తి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రేవల్లిలో 2017 జూన్, 29న ఉచిత ఆపరేషన్ నిర్వహించారు. క్యాంపులో గ్రామానికి చెందిన మహిళ ఎం.లలిత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోగా వికటించింది.
అనారోగ్యానికి గురైన ఆమెను వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అనంతరం మెరుగైన వైద్యానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదే ఏడాది జులై 9న చనిపోయింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించగా.. అది సరిపోదని మరోసారి కమిషన్ ను ఆశ్రయించింది. ప్రస్తుతం రూ.8లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశించారు
