తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో.. ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో.. ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు బుధవారం రిలీజ్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్​లో పాస్ పర్సంటేజీ తగ్గగా.. సెకండ్ ఇయర్​లో పెరిగింది. ఫస్టియర్​లో 60.01 శాతం, సెకండ్ ఇయర్​లో 64.19 శాతం స్టూడెంట్లు పాస్ అయ్యారు. సీనియర్ ఇంటర్ రిజల్ట్స్​లో ములుగు జిల్లా టాప్​లో ఉండగా.. కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్​లోని ఇంటర్ బోర్డు ఆఫీస్​లో సెక్రటరీ శృతి ఓజా, ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాబాయి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్​తో కలిసి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఈ ఎగ్జామ్స్​కు 9,81,003 మంది ఇంటర్ స్టూడెంట్లు హాజరయ్యారు. ఫస్టియర్​లో 4,78,723 మంది పరీక్షకు హాజరుకాగా, 2,87,231 (60.01 శాతం) మంది, సెకండ్ ఇయర్​లో 5,02,280 మంది ఎగ్జామ్స్ రాయగా.. 3,22,432 మంది (64.19శాతం) పాసయ్యారు. కాగా, ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫస్ట్​ఇయర్​లో 51.21 శాతం అబ్బాయిలు పాసైతే.. గర్ల్స్ 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్​లో 56.10 శాతం అబ్బాయిలు పాసైతే.. 72.53 శాతం గర్ల్స్ పాసయ్యారు. ఎక్కువ మంది స్టూడెంట్స్​కు 75శాతం పైనే మార్కులు వచ్చాయి. 

నిరుడుతో పోలిస్తే ఫస్టియర్​లోతగ్గిన పాస్ పర్సంటేజీ

గతేడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది. సెకండ్ ఇయర్​లో మాత్రం పెరిగింది. 2023లో ఇంటర్‌ ఫస్టియర్‌లో 61.68 శాతం మంది పాస్ కాగా, ఈ సారి 60.01 శాతం మాత్రమే పాసయ్యారు. సెకండియర్ లో గతేడాది 63.49 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. ఈసారి 64.19 శాతానికి పెరిగింది. ఫస్టియర్‌ జనరల్ కోర్సుల్లో రంగారెడ్డి (71.7%), మేడ్చల్ (71.58%) టాప్​లో ఉండగా, కామారెడ్డి 34.81 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ లో 72.96% తో నారాయణపేట టాప్​లో ఉండగా, సూర్యాపేట 39.90 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో ములుగు (82.95%), మేడ్చల్‌ (79.31%) జిల్లాలు మొదటి, రెండు స్థానాల్లో ఉండగా, కామారెడ్డి 44.29శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఒకేషనల్ కోర్సుల్లో నారాయణ పేట టాప్​లో నిలవగా, నిజామాబాద్ జిల్లా లాస్ట్​లో నిలిచింది.

స్టూడెంట్లు అధైర్యపడొద్దు: బుర్రా వెంకటేశం

పరీక్షల్లో ఫెయిల్ అయిన, మార్కులు తక్కువ వచ్చిన స్టూడెంట్స్ అధైర్య పడొద్దని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. టెన్త్, ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా సివిల్స్‌లో టాపర్స్‌గా నిలిచిన సందర్భాలున్నాయని తెలిపారు. ప్రైవేటు కాలేజీలో చదివితేనే మంచి మార్కులొస్తాయనే భ్రమలో ఉండొద్దని, తాజా ఫలితాలు చూస్తే ప్రభుత్వ కాలేజీల్లోనూ మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. 

ఫలితాలపై మానసిక ఆందోళనకు గురయ్యే వారి కోసం టెలీ మానస్‌ ఏర్పాటు చేశామని, 14416 నంబర్‌కు కాల్‌ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చన్నారు. ఫలితాలపై సందేహాలుంటే 040 – -24655027 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. ఇంటర్‌ కాలేజీల గుర్తింపు ప్రక్రియను మే నెలలో పూర్తి చేస్తామని, ప్రైవేటు కాలేజీలపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. త్వరలోనే ఆర్జేడీ ఆఫీసును వరంగల్ కు తరలిస్తామని చెప్పారు.

మే 2 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్​కు చాన్స్

ఇంటర్ ఆన్సర్ షీట్ల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్​కు గురువారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు అప్లై చేసేందుకు అవకాశం ఉందన్నారు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపర్​కు వంద రూపాయలు, రీ వెరిఫికేషన్ కు రూ.600 చెల్లించాలని సూచించారు. విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్​ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మే 24 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపారు.