ఇంటర్ ఫలితాల్లో విద్యార్ధులు ఆందోళన చెందవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, విద్యార్ధులు మరింతగా చదివి మంచి మార్కలను సాధించాలని తెలిపారు. విద్యార్థులను తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని అన్నారు. ఇంటర్ సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దనే ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలిగించామని సబితా తెలిపారు.
మే 10 నుంచి రీ కౌంటింగ్, వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని, ఇందుకోసం ఫీజు చెల్లించుకోవచ్చునని మంత్రి సబిత తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఆమె వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకువిద్యార్ధులు కలర్ ప్రింట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు.
ఈ ఏడాది ఫస్టియర్ ఫలితాలో 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇందులో 75శాతంతో మేడ్చల్ మొదటిస్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక సెకండియర్ ఫలితాలో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 85శాతంతో మొదటిస్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ఫస్టియర్, సెకండియర్ రెండు ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
అయితే గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్టియర్ లో 2శాతం తగ్గగా, సెకండియర్ లో 1శాతం ఫలితాలు తగ్గాయి. కాగా రేపు అంటే మే 10 న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను మంత్రి సబిత బషీర్ బాగ్ లోని SCERT లో విడుదల చేయనున్నారు.