జూన్​ 1 నుంచి ఇంటర్​ కాలేజీలు..హాలిడేస్ లో క్లాసులు పెట్టొద్దు

జూన్​ 1 నుంచి ఇంటర్​ కాలేజీలు..హాలిడేస్ లో క్లాసులు పెట్టొద్దు
  •      అకడమిక్​ క్యాలెండర్​ను విడుదల చేసిన బోర్డు

  •     మొత్తం 227 రోజులు వర్కింగ్​ డేస్, 75 రోజులు సెలవులు

  •     సమ్మర్  హాలిడేస్ లో క్లాసులు పెట్టొద్దని స్పష్టం

  •     లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్  ఫస్టియర్, సెకండియర్​ క్లాసులను జూన్​ ఒకటో తేదీ నుంచి పున:ప్రారంభించాలని అన్ని జూనియర్  కాలేజీలకు ఇంటర్​ బోర్డు స్పష్టం చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియెట్​​అకడమిక్​ క్యాలెండర్​ను ఇంటర్​ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శనివారం విడుదల చేశారు. దసరా, సంక్రాంతి సెలవులు సహా చివరి వర్కింగ్​ డే తేదీలను కూడా అందులో బోర్డు వెల్లడించింది. అక్టోబర్​ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుగా పేర్కొంది. హాఫ్​ ఇయర్లీ ఎగ్జామ్స్​ను నవంబర్​ 18 నుంచి 23 వరకు, జనవరి 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్​ ఎగ్జామ్స్​నిర్వహించాలని సూచించింది.  

ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్​ ఎగ్జామ్స్, మార్చి ఫస్ట్  వీక్ లో థియరీ ఎగ్జామ్స్​ ఉంటాయని, అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ మే చివరి వారంలో ఉంటాయని వివరించింది. మొత్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో మొత్తం 227 వర్కింగ్​ డేస్​గా పేర్కొన్న ఇంటర్​ బోర్డు..  ఆదివారాలు, సెకండ్​ సాటర్ డేలు, పండుగ సెలవులన్నీ కలిపి 75 రోజులుగా సెలవులను ప్రకటించింది. సమ్మర్  హాలిడేస్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులను నిర్వహించకూడదని బోర్డు స్పష్టం చేసింది. మే 31 వరకు కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వాల్సిందేనని, కాలేజీలను తెరవకూడదని తేల్చి చెప్పింది. ఆదివారాలు, పబ్లిక్​ హాలిడేలను కచ్చితంగా ఫాలో కావాలని స్పష్టం చేసింది. కాదని కాలేజీలను తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారమే అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు స్పష్టం చేసింది.