ఆన్సర్‌ షీట్ల కాపీలు ఇవ్వరట

ఆన్సర్‌ షీట్ల కాపీలు ఇవ్వరట

వెలుగు: స్టూడెంట్లకు ఆన్సర్‌ షీట్ల కాపీలను ఇచ్చే విషయంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు వింత వైఖరి అవలంబిస్తోంది. సమాచార హక్కు చట్టం కింద జవాబు ప్రతులను ఇవ్వడానికి వీలులేదని ప్రకటించింది. వాస్తవానికి ఆర్టీఐ చట్టంలోని రూల్‌నంబర్‌ 4 ప్రకారం ఆన్సర్‌ షీట్ల జిరాక్స్‌‌ కాపీలను ఇవ్వాల్సిందేనని రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇదే తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆర్టీఐ యాక్ట్ అందుబాటులోకి వచ్చాక విద్యార్థుల ఆన్సర్‌ షీట్లు కూడా సమాచారమే కాబట్టి తమకు జిరాక్స్ కాపీలను ఇవ్వాలనే దరఖాస్తులు విద్యాసంస్థలకు వెల్లు వెత్తాయి. అయితే ఇందుకు యూపీఎస్‌సీ, సీబీఎస్‌ ఈ తదితర సంస్థలు నిరాకరించాయి. దీంతో ఆదిత్య బందోపాధ్యాయ అనే వ్యక్తి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జవాబులు విద్యార్థి సొంత సమాచారమని, వాటిపై వాల్యూయేషన్‌ లో లభించినమార్కులు కూడా ఇవ్వదగిన సమాచారమేనని సుప్రీంకోర్టు తేల్చింది. అలాగే ఆన్సర్‌ షీట్లు ఇచ్చేందుకు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయొద్దని, పేజీకిరూ.2 చొప్పున మాత్రమే తీసుకోవాలని మరో కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాలు, కేంద్ర సమాచార కమిషన్‌ తీర్పులు, ఆదేశాలున్నా బోర్డు జవాబు పత్రాలివ్వడానికి వీలుకాదని పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.