ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాప్కిన్ మిషన్లు : సీతక్క, పొన్నం ప్రభాకర్​

ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాప్కిన్ మిషన్లు : సీతక్క, పొన్నం ప్రభాకర్​
  • పైలట్ ప్రాజెక్టుగా ములుగు, హనుమకొండ బస్టాండ్​లో ఏర్పాటు   
  • సహేలి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు : దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్, బస్​ డిపోల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం వినూత్న ఆలోచనతో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.  సహేలీ సంస్థ,  రవాణా శాఖ, ఆర్టీసీల సహకారంతో పది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సహేలీ స్వచ్ఛంద సంస్థ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నది. 

పైలట్​ప్రాజెక్టుగా హన్మకొండ, ములుగు బస్టాండ్లలో శానిటరీ నాప్కిన్ మిషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత హుస్నాబాద్, హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు, డిపోలకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. నాప్కిన్​ మిషన్లను ఏర్పాటు చేస్తున్న  సహేలి స్వచ్ఛంద సంస్థ పోస్టర్​ను శుక్రవారం మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​ఆవిష్కరించారు. 

సహేలితో మహిళల ఆరోగ్యానికి కృషి

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల కోసం సహేలి అనే సంస్థ సహకారంతో ఆర్టీసీ బస్టాండ్లలో నాప్కిన్ల మిషన్​ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. సహేలి సంస్థ ద్వారా  మహిళల ఆరోగ్యానికి కృషి చేస్తామన్నారు. బస్సులలో ప్రయాణించే మహిళలు, అమ్మాయిలకు సడన్ గా నెలసరి సమస్యలు వస్తే ప్యాడ్స్ దొరకక ఇబ్బందులు పడతారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని నాప్కిన్​మిషన్లను బస్టాండ్ లో ఏర్పాటు చేసేందుకు సహేలి సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆర్టీసీ బస్టాండ్లలో ఈ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెలసరితో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ములుగు, హనుమకొండలో బస్టాండ్లలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ మిషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన సహేలి సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమకు అభినందనలు తెలిపారు.