లాక్ డౌన్ కు నెల..రాష్ట్రంలో తగ్గని కరోనా

లాక్ డౌన్ కు  నెల..రాష్ట్రంలో తగ్గని కరోనా
  • మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్
  • మర్కజ్ లింక్​తో పెరుగుతూనే ఉన్న కేసులు
  • సగటున రోజుకు 30 మందికి వైరస్
  • రాష్ట్రంపై ఇంకా పడగ దించని కరోనా

హైదరాబాద్‌‌, వెలుగుమార్చి 22.. సరిగ్గా నెల రోజుల కిందట దేశమంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలంతా కలిసి వేసిన తొలి అడుగు అది. బస్సులు, రైళ్లు సహా పబ్లిక్‌‌, ప్రైవేటు ట్రాన్స్‌‌పోర్ట్ మొత్తం బంద్ పెట్టారు. హోటళ్లు, థియేటర్లు, క్లబ్బులు, పబ్బులు, ఫంక్షన్లు అన్నీ మూసేశారు. ఆ మరుసటి రోజు నుంచే రాష్ర్టంలో లాక్​డౌన్ మొదలైంది. అంటే నేటికి సరిగ్గా నెల.

22న సాయంత్రమే లాక్​డౌన్​ ప్రకటన

మార్చి 22న జనతా కర్ఫ్యూతో రాష్ర్టంలో లాక్‌‌డౌన్‌‌ మొదలైంది. అదే రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్‌‌ మీట్ పెట్టి మార్చి 31 వరకు లాక్‌‌డౌన్‌‌ పెడుతున్నట్టు ప్రకటించారు. తర్వాత మే 7 వరకు పొడిగించారు. లాక్‌‌డౌన్‌‌తో జనాలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం పూర్తి స్థాయిలో ఆగలేదు. లాక్‌‌డౌన్‌‌కు ముందు మార్చి 21వ తేదీన రాష్ర్టంలో కేవలం 21 కేసులు ఉంటే..  మంగళవారం నాటికి కేసుల సంఖ్య 928కి చేరింది. లాక్‌‌డౌన్‌‌లో ప్రతి రోజూ సగటున 30 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశాలు, ఢిల్లీ, ఇతర చోట్ల వైరస్ అంటించుకున్నోళ్లు 300 మంది ఉండగా, మిగిలిన ఆరొందల మందికి లోకల్‌‌గానే వైరస్‌‌ సోకింది. ఎక్కువ శాతం మందికి కుటుంబ సభ్యుల నుంచే వైరస్ అంటుకుంది. కొంతమందికి వైరస్ ఎలా సోకిందో, ఎవరి నుంచి అంటుకుందో తెలియదు. గ్రేటర్ హైదరాబాద్‌‌, సూర్యాపేట సహా పలు జిల్లాల్లో ఇన్ఫెక్షన్‌‌ సోర్స్‌‌ తెలియని కేసులు ఉన్నాయి.

ఫారిన్‌‌ నుంచి వచ్చిన వాళ్లలో 34 మందికి వైరస్ సోకితే, వాళ్ల ద్వారా మరో 30 మందికి సోకింది. కానీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అక్కడికి వెళ్లొచ్చిన 232 మందికి వైరస్ సోకింది. వాళ్ల ద్వారా సుమారు ఐదొందల మందికి అంటుకుంది. ఇంకా ఆ లింక్‌‌ కొనసాగుతూనే ఉంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమేనన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ర్టంలో మర్కజ్ లింకున్న తొలి కేసు మార్చి 17న నమోదైంది. ఆ తర్వాతి రోజు మరో 8 మందికి వైరస్ పాజిటివ్‌‌ వచ్చింది. అప్పటినుంచి మర్కజ్ లింక్ కేసులు రోజూ వస్తూనే ఉన్నాయి.

సర్వైలెన్స్​లో ఫెయిల్

సర్వైలెన్స్‌‌లో భాగంగా కరోనా సోకిన వ్యక్తి ట్రావెల్ హిస్టరీ, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌‌ను మొత్తాన్ని పబ్లిక్ హెల్త్ విభాగం గుర్తించి, క్వారంటైన్ చేయాలి. కానీ మర్కజ్ లింక్ కేసులు నమోదైన పది రోజుల తర్వాత కూడా పబ్లిక్ హెల్త్ విభాగం ఆ పని చేయలేదు. దీంతో మర్కజ్ వాళ్ల కుటుంబ సభ్యులకు, ఇతరులకూ వైరస్ వ్యాపించింది. ఇప్పటికీ ఆ లింక్ వల్ల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉన్న రాజకీయాల వల్ల సీనియర్లను కాదని, కరోనా పేషెంట్ల సర్వైలెన్స్‌‌, ఇతర కీలక బాధ్యతలను జూనియర్లకు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నా.. కీలక స్థానంలో ఉన్న తమకంటే జూనియర్ అడ్డుపడుతున్నాడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. సర్వైలెన్స్‌‌ సరిగా ఉంటే ఇన్ని కేసులు ఎందుకొస్తాయని మరో ఉన్నతాధికారి ప్రశ్నించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి సరైన ఫీడ్ బ్యాక్ వెళ్లడం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. కమ్యునిటీ స్ర్పెడ్ జరుగుతున్నా, ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం ప్రమాదకరమని చెబుతున్నారు. ర్యాండమ్ టెస్టులు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పాల్సిన బాధ్యత వైద్యారోగ్యశాఖదే అయినా.. ఆ విషయాన్ని ఇప్పుడు కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పలేకపోతున్నారని అంటున్నారు.