మొక్కలు నాటుడు : చెట్లు నరుకుడు

మొక్కలు నాటుడు : చెట్లు నరుకుడు

రెండింటిలోనూ దేశంలోనే మన రాష్ట్రం ఫస్ట్
మూడేండ్లలో 12 లక్షల చెట్ల నరికివేతకు అనుమతి
హరితహారంలో 84 కోట్ల మొక్కలు నాటిన సర్కార్‌‌‌‌
పదేండ్లలో దేశవ్యాప్తంగా నరికేసిన చెట్లు 38 కోట్లు.. అందులో తెలంగాణలో కొట్టేసినవి 33 కోట్లు
లోక్‌‌సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో అడవుల నరికివేత యథేచ్ఛగా సాగింది. అడవులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్‌‌, ఖమ్మం‌‌ సహా పలు జిల్లాల్లో కలప స్మగ్లర్లు, పోడు సాగుదారులు కోట్లకొద్దీ చెట్లను నరికివేశారు. 2010–2019 మధ్య దేశవ్యాప్తంగా 38 కోట్ల చెట్లను తొలగిస్తే.. ఒక్క తెలంగాణలోనే 33.43 కోట్ల చెట్లను నరికినట్టు కేంద్రం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 801 కోట్ల మొక్కలు నాటితే.. అందులో 190 కోట్లు తెలంగాణలో నాటినట్టు  పేర్కొంది. ఇందులో నాలుగైదేళ్లలో నాటిన మొక్కలే వంద కోట్లకుపైగా ఉన్నాయి. ఇప్పటికీ ఇటు మొక్కలు నాటుతూనే.. మరోవైపు వివిధ ప్రాజెక్టుల కోసం చెట్లను నరకడానికి అనుమతులు ఇస్తున్నరు. అవసరమైతేనే తప్ప చెట్లు నరకడానికి తాము అనుమతించడం లేదని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో పదేండ్లలో 2 లక్షల 48 వేల చెట్లను నరకగా.. 74 కోట్ల 33 లక్షల మొక్కలు నాటారని కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్, వెలుగుమొక్కలు నాటడంలో, చెట్లు నరికేయడంలో రెండింటిలోనూ మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌‌‌‌ వన్‌‌ ప్లేస్​లో నిలిచింది. ఏటా తెలంగాణకు హరితహారంలో భాగంగా భారీగా మొక్కలు నాటుతూనే, మరోవైపు లక్షల సంఖ్యలో పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి పనులు, ఇతర అవసరాల కోసం గత మూడేండ్లలో 12,12,753 చెట్లను కొట్టేయడానికి రాష్ట్ర అటవీశాఖ అనుమతించింది. అనధికారికంగా స్మగ్లర్లు ఇంతకు రెండింతలు చెట్లను నరికేశారు. ఇక దేశవ్యాప్తంగా ఈ మూడేండ్లలో 76 లక్షల 72 వేల 337 చెట్లను తొలగించారని, సుమారు 345 కోట్ల మొక్కలు నాటారని కేంద్ర అటవీశాఖ తాజాగా లోక్‌‌సభలో వెల్లడించింది. అందులో హరితహారం కింద తెలంగాణలో 84 కోట్ల మొక్కలు నాటారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్స్‌‌లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.26 లక్షల హెక్టార్లలో 27.74 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒడిశా (22.75 కోట్లు) మినహా దేశంలో మరే రాష్ట్రం ఈ స్థాయి లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదని కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో
వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం