- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్లారిటీ
- యాదగిరిగుట్ట నారసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో 19 ఏండ్ల క్రితం ఎన్జీవోగా పుట్టిన ‘తెలంగాణ జాగృతి’ సంస్థ.. ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీగా మారొచ్చని ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన మండపంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ జాగృతి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గా ఉన్నా సరే.. ప్రజల సమస్యలపై మొదటి నుంచి ఎన్నో రకాల రాజకీయ పోరాటాలు చేశామని, ఇకపై కూడా రాజకీయంగా మాట్లాడుతాం, పోరాడతామని స్పష్టం చేశారు. ఉద్యమంలో ప్రజల తరఫున మాట్లాడామని, ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో తెలంగాణ జాగృతి తన గళాన్ని వినిపించిందన్నారు. ప్రజల తరఫున పోరాడాలంటే రాజకీయ పార్టే కానవసరం లేదన్న ఆమె.. కానీ ప్రజలు కోరుకుంటే మాత్రం తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారవచ్చని పేర్కొన్నారు.
