రెండేండ్లు గా జర్నలిస్టులపై వివక్ష... ఏ ఒక్క హామీనీ సీఎం అమలు చేయట్లే

రెండేండ్లు గా జర్నలిస్టులపై వివక్ష...  ఏ ఒక్క హామీనీ సీఎం అమలు చేయట్లే
  •     సర్కారు విధానం మారకపోతే జర్నలిస్టుల చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తాం
  •     టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య
  •     సమాచార భవన్ ను​ముట్టడించిన జర్నలిస్టులు

మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఐఅండ్ పీఆర్ కమిషనర్ ఆఫీస్(సమాచార భవన్)ను ముట్టడించారు. టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన జర్నలిస్టుల చలో హైదరాబాద్ పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి అనేక మంది జర్నలిస్టులు తరలివచ్చారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఅండ్ పీఆర్ ఆఫీస్​ఎదుట బైఠాయించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా జర్నలిస్టులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. 

బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేకపోవడం దారుణమన్నారు. కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వలేకపోయిందని, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. ఉద్యోగ విరమణ పొందిన పాత్రికేయులకు అనేక రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుండగా.. మన రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వడం లేదన్నారు. 

చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ ను పూర్తిగా అణచివేస్తోందని, రెండేండ్లుగా అడ్వర్టైజ్​మెంట్స్ బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. సర్కారు విధానం ఇలాగే ఉంటే.. త్వరలో జర్నలిస్టుల చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు.  జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ మద్దతు తెలిపారు. 

వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయకుమార్, వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపూరావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జగదీశ్వర్, ఎర్రమిల్లి రామారావు, రాష్ట్ర నాయకులు పాండురంగారావు, పొట్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ రఫీ, పద్మనాభరావు, ఉమామహేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవి, కో-కన్వీనర్లు ఆర్.శ్రీనివాస్ గౌడ్, సంతోష్, బ్రహ్మం తదితరులు ఐఅండ్ పీఆర్ డైరెక్టర్ కిశోర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.