నేడు (జూలై 20) క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం

నేడు (జూలై 20) క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం
  • గ్రామం నుంచి మహానగరం వరకు ప్రతి పేదోడికి నివాసం కల్పిస్తాం హౌసింగ్ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదోడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌‌‌‌ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఆదివారం హౌసింగ్ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను నిజం చేయబోతోందని మంత్రి పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఎల్‌‌‌‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్​లో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్‌‌‌‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో కలిసి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్‌‌‌‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

కీలక ప్రాంతాల్లో 10 ఫ్లోర్లతో టవర్లు 

పేదల ఇళ్ల కోసం నగరంలో కోట్ల రూపాయల విలువైన అత్యంత కీలక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులను బట్టి ఎకరా నుంచి ఐదెకరాల వరకు స్థలాలను సేకరించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి  తెలిపారు. కుటుంబాల జీవనోపాధికి, పిల్లల చదువులకు, ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. అధునాతన సౌకర్యాలతో 10 ఫ్లోర్లలో  భవనాల నిర్మాణం చేపట్టి, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, గతేడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాల్లో సొంతింటి వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి పేర్కొన్నారు. 

రూ. 5 లక్షల సబ్సిడీతో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్..

‘ఇందిరమ్మ ఎల్‌ఐజీ’ స్కీమ్‌లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 24 నియోజకవర్గాల్లో ప్రభుత్వం బహుళ అంతస్థుల బిల్డింగ్​లు నిర్మించి పేదలకు అందజేయనుంది. ప్రతి ప్లాట్ (సింగిల్​బెడ్​రూం) 600 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంతో ఉంటుంది. దీని నిర్మాణ ఖరీదు రూ. 10 లక్షలు కాగా, ఇందులో ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన రూ. 5 లక్షలు లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. స్థలంతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఖర్చులను ప్రభుత్వమే భరించి లబ్ధిదారుడికి అందజేస్తుంది. ఈ పథకానికి అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారులు ‘మీ సేవా’ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్స్, కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలను నేడు మంత్రులు అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ స్కీమ్ పట్టణ ప్రాంత పేదలకు ఒక గొప్ప వరంగా మారనుందని అధికారులు పేర్కొంటున్నారు.