- జెట్‌స్పీడ్‌గా రైతు డిస్కం ఏర్పాటు పనులు
- ఇప్పటికే సంస్థ సీఎండీ, డైరెక్టర్ల నియామకం
- తాజాగా 51 మంది ఇంజనీర్లు, ఉద్యోగుల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)కు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు విద్యుత్ పంపిణీ లైసెన్స్ కోసం గురువారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు రైతు డిస్కం దరఖాస్తు చేసింది. మొత్తంగా రైతు డిస్కం ఏర్పాటు పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముషారఫ్ అలీ ఫారూఖీని కొత్త డిస్కమ్ సీఎండీగా, ఇతర డిస్కమ్‌లలో డైరెక్టర్లుగా ఉన్న నలుగురిని రైతు డిస్కం డైరెక్టర్లుగా నియమించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ, రైతు డిస్కం సీఎండీ, దక్షిణ డిస్కం సీఎండీ, ఉత్తర డిస్కం సీఎండీ, ఉత్తర–దక్షిణ డిస్కంల డైరెక్టర్ (ఫైనాన్స్) లను షేర్‌హోల్డర్లుగా జీఓలో పేర్కొంది. తాజాగా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి డిప్యూటేషన్ పై 51 మంది ఇంజనీర్లు, ఉద్యోగులను రైతు డిస్కమ్‌కు కేటాయించడం విశేషం.
జెట్స్పీడ్తో పనులు: ముషారఫ్ అలీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కం కు మార్చి 18న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) ఆమోదం లభించింది. రైతులకు ప్రత్యేకంగా నిరంతరం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ఈ డిస్కంను ఏర్పాటు చేస్తోంది. ఉగాది పర్వదినాన లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాం. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి ముందస్తుగా, కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసేందుకు దక్షిణ, ఉత్తర డిస్కంల నుంచి మొత్తం 51 మంది ఇంజినీర్లు, సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించాం.
