
- ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ స్కీమ్ కింద ఒంటరి మహిళలకు 50 వేల ఆర్థిక సాయం
- ‘రేవంతన్న కా సహారా - మిస్కీన్‌కే లియే’ కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్‌లు.. ఒక్కొక్కరికీ రూ. లక్షగ్రాంట్
- రెండు పథకాలకు రూ.30 కోట్లు కేటాయింపు
- ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాల కోసం 2 కొత్త పథకాలను తీసుకొచ్చింది. ముస్లిం వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద రూ. 50 వేల చొప్పున సాయం అందించనున్నది. ‘రేవంతన్న కా సహారా – మిస్కీన్‌కే లియే’ స్కీమ్ కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వెహికల్స్ అందించడానికి ఒక్కొక్కరికీ ₹లక్ష గ్రాంట్ మంజూరు చేయనున్నది. ఈ రెండు స్కీమ్‌లను శుక్రవారం సెక్రటేరియెట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని, అర్హులైన వారిని ఎంపిక చేసి..ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
మైనార్టీ వర్గాల కోసం కొత్తగా తీసుకొచ్చిన రెండు స్కీమ్‌లను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇవి ముస్లిం మైనారిటీల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజనా’ స్కీమ్ తోడ్పడుతుందని చెప్పారు. ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడని, ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోపే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అర్హులైన వారందరూ TGOBMMS వెబ్‌పోర్టల్ (tgobmms.cgg.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని, ఆఫ్‌లైన్ అప్లికేషన్లను స్వీకరించబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, టీజీఎంఎఫ్‌సీ వీసీ, ఎండీ క్రాంతి వెస్లీ, తదితరులు పాల్గొన్నారు.