పవన్ వ్యాఖ్యల దుమారం.. ఏపీ ,తెలంగాణ మధ్య మాటల మంటలు

పవన్  వ్యాఖ్యల  దుమారం.. ఏపీ ,తెలంగాణ మధ్య మాటల మంటలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రజలను, నాయకులను ఉద్దే శించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఏపీ, తెలంగాణ మధ్య గ్యాప్ పెంచాయి. పవన్ కల్యాణ్ తెలంగాణకు   క్షమాపణ చెప్పాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. 'పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.. భేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజల దిష్టి కాదు ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారు.. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పకపోతే.. ఒక్క సినిమా కూడా ఆడదు. సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. క్షమాపణ చెప్పక పోతే.. ఒక్క థియేటర్ లో కూడా సినిమా విడుదల కాదు మీది' అని హె చ్చరించారు. 'చిరంజీవి సూపర్ స్టార్.. ఆయన మంచోడు.. కానీ, పవన్ కల్యాణ్కు రాజకీయ అనుభవం లేదు అనుకుంటా.. అందుకే అలా మాట్లాడుతున్నారు' అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

మీరు గెలిచాకే దిష్టి: ఎంపీ చామల

 ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా అదే స్థాయిలో రియాక్టయ్యారు. పవన్ కళ్యాణ్ అవకాశవాది లాగా, అనాలోచిత ప్రకటనలు చేస్తున్నాడన్నారు. గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజలను సమానంగానే చూసిందని అన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. మాట్లాడుతూ.. కోనసీమ ప్రాంతానికి మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యాకే.. మిమ్మల్ని గెలిపించినందుకే దిష్టితగిలిందని విమర్శించారు. అక్కడ ఉన్న సమస్యల పైన మాట్లాడాలని సూచించారు.  తెలంగాణ  వాళ్ల కండ్లవి దిష్టి కండ్లనడం సరికాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి అన్నారు. తెలంగాణపై గౌరవం ఉంటే.. పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేని పక్షంలో తెలంగాణ శక్తులన్నీ ఒక్కటవుతాయని హెచ్చరించారు.

తలతిక్క మాటలు మానుకోవాలి: వాకిటి

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీమరి సీరియస్ అయ్యారు.  తలతిక్క మాటలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావు..మైలేజ్ పొందాలంటే పనితనం చూపించు కానీ,ఇలా కాదు అని సూచించారు ఇపుడు పవన్ ఇలా మాట్లాడటం సరికాదు. అన్నదమ్ముల్లా విడిపోయా కలిసుందాం అని అన్నారు.

 బీజేపీ, చంద్రబాబు స్పందించాలె: పొన్నం

 కోనసమీలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అనడం అవివేకమని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వ్యాఖ్యల ు తెలంగాణ ప్రజలకు తీవ్ర అవమానకరమని మండిపడ్డారు. హుస్నాబాద్ లో మాట్లాడిన పొన్నం..పవన్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని ..వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపైన మిత్రపక్షమైన బీజేపీ, చంద్రబాబు స్పందించాలని కోరారు.

తరిమి కొడతాం: బల్మూరి

పవన్ కల్యాణ్ గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్కు తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని సూచించారు తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్ కల్యాణ్ప భగ్గుమన్నారు.

పవన్ ఏమన్నారంటే.?

గోదావరి జిల్లాలను అన్నపూర్ణ అంటారు... రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే..ఆ శాపం తగిలేసినట్టుంది..గోదావరి జిల్లాలు మొత్తం కొబ్బరి చెట్లతోటి ఉంటాయి.. తెలంగాణ నాయకులంతా పచ్చదనంతో కోనసీమ బాగుంటది అంటరు.. పచ్చదనంతో ఆనందంగా ఉంటారు మీరంతా అంటారు.. ఇవాళ కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు.. అంత దిష్టితగిలింది. కోన సీమకు..నరదృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందంటారు.. అలాంటిది.. కోనసీమ పచ్చదనం.. ఎంత మంది దిష్టి తగలిందో.. ఇవాళ మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే.. దీనిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది