ఎల్కతుర్తి (కమలాపూర్)/ వర్ధన్నపేట/ పర్వతగిరి/ నల్లబెల్లి/ తాడ్వాయి, వెలుగు: మొంథా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను శుక్రవారం వివిధ పార్టీల నాయకులు పరిశీలించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ పరిశీలించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి, నల్లబెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ స్థానిక నాయకులు నష్టపోయిన పంటలను పరిశీలించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఊరటం గ్రామ పరిధిలో దెబ్బతిన్న పంటలను తుడుందెబ్బ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని అధికారులను కోరారు.
