- లిక్కర్ ఆమ్దానీ.. రోజుకు 105 కోట్లు
- రేట్ల పెంపుతో 25 కోట్ల అదనపు ఆదాయం
- గతంలో రోజుకు 80 కోట్ల సేల్స్
- ధరలు పెరిగినా తగ్గని అమ్మకాలు
హైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ కు లిక్కర్ సేల్స్ ద్వారా మస్తు ఆమ్దానీ వస్తోంది. ఇటీవల రేట్లు పెంచడంతో ఆదాయం మరింత పెరిగింది. గతంలో రోజుకు సగటున రూ.80 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఇప్పుడది ఏకంగా రూ.105 కోట్లకు పెరిగింది. అంటే రోజుకు రూ.25 కోట్ల అదనపు ఆదాయం వస్తోంది. ఈ నెల 19 నుంచి పెంచిన మద్యం రేట్లు అమల్లోకి వచ్చాయి. ఆ రోజు నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,045 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సగటున రూ.105 కోట్ల దాకా మద్యం అమ్మారు. ఇదే నెలలో 8 నుంచి 17 వరకు మాత్రం రూ.870 కోట్ల విలువైన మద్యమే అమ్ముడైంది. అంటే పది రోజుల్లోనే సుమారు రూ. 135 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. లిక్కర్ రేట్లు 20 నుంచి 25 శాతం పెంచడం, అయినా అమ్మకాలు జోరుగా కొనసాగుతుండడంతో సర్కార్కు భారీగా ఆదాయం సమకూరుతోంది.
మేలో 600 కోట్ల అదనపు ఆదాయం :-
ఈ నెలలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఒకటో తేదీ నుంచి శనివారం వరకు రూ.2,460 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో 23 లక్షల కేసుల ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్), 48 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. గతేడాది మేలో ఇదే సమయానికి రూ.1,854 కోట్ల లిక్కర్ మాత్రమే అమ్ముడైంది. అంటే సర్కార్ కు రూ.600 కోట్లకు పైనే అదనపు ఆదాయం వచ్చింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే వరకు రూ.5,200 కోట్ల మద్యం అమ్ముడైంది. అయితే గతేడాది మేలో కరోనా సెకండ్ వేవ్ ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆ టైమ్ లో ఒక్క రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ చేయలేదు.
మరిన్ని వార్తల కోసం :-
సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి
అమెరికా బాట పట్టిన నేతలు
