
కొడిమ్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం ద్వారా రావలసిన రూ.4వేల కోట్లను తెలంగాణ నష్టపోయిందని కరీంనగర్ మాజీ ఎంపీ, ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆరోపించారు. సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మల్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బల్కం మల్లేశం, మాజీ ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, సుమారు 300 మంది బీఆర్ఎస్ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా 42 శాతం బీసీల రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించలేకపోయారని విమర్శించారు. ఆ రెండు పార్టీల నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసి మార్కెట్ కమిటీల్లో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, లీడర్లు ప్రశాంతి, కృష్ణారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.