సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘటన
మృతురాలు కోహిర్ డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్
అమీన్‌పూర్, వెలుగు : అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఆదివారం జరిగింది. సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామానికి చెందిన వెంకటబ్రహ్మయ్యకు, గుంటూరు పట్టణానికి చెందిన చెవిల కృష్ణవేణి (44)తో వివాహమైంది. 2012లో అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి ఇక్కడే ఉంటున్నారు.
వెంకటబ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. కృష్ణవేణి కోహిర్ డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. వెంకటబ్రహ్మయ్య భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన వెంకటబ్రహ్మయ్య ఇంట్లో ఉన్న బ్యాట్‌తో భార్య కృష్ణవేణి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, వెంకటబ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
