
హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నేతలు శనివారం నోటీస్ ఇచ్చారు. బస్‌భవన్‌లో ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ అందుబాటులో లేకపోవడంతో పేషీలో అధికారులతోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీవీరావుకు నోటీస్ అందజేశారు. అనంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. సమస్యల్ని పరిష్కరించకుంటే 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగనున్నట్టు చెప్పారు. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణ నేటికీ అమలుకాకపోవడం దారుణమన్నారు. రిక్రూట్‌మెంట్ లేక కార్మికులపై పనిభారం పెరిగిందన్నారు.
ఫస్ట్‌కే శాలరీలియ్యాలె
కార్మికులు, ఉద్యోగుల శాలరీలను 6,7 తేదీల్లో ఇస్తున్నారని, ప్రతి నెలా ఫస్ట్‌నే ఇవ్వాలని హనుమంతు డిమాండ్ చేశారు. కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేధింపులు మానుకోవాలన్నారు. సీసీఎస్, పీఎఫ్‌ల నుంచి వాడుకున్న డబ్బులు తిరిగి చెల్లించి లోన్లు వచ్చేలా చూడాలన్నారు. డ్యూటీ చేస్తూ చనిపోతే కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఆర్టీసీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా సమ్మె చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.సుధాకర్, చీఫ్ వైఎస్ ప్రెసిడెంట్ డీవీకే రావు, జాయింట్ సెక్రటరీలు గోలి రవీందర్, స్వాములయ్య, నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శలు జల్లా వెంకటేశ్వర్లు, పీకే మూర్తి, పీఎస్‌ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.