
- మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి
ఖైరతాబాద్,వెలుగు: కార్టూన్ వ్యవస్థ అంతరించిపోయే దశలో ఉందని, దానిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతికా రంగంలో ప్రూఫ్ రీడర్స్ వ్యవస్థ అంతరించిపోయిందని అన్నారు. కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. రఘు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరై.. తెలంగాణ టుడే ఎడిటోరియల్ కార్టూనిస్టు పి. నర్సింకు కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డును అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ప్రైవేట్ దవాఖానల్లో పనిచేయడం లేదని, దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నామని, 1/3 వంతు జర్నలిస్టులు చెల్లిస్తే, 2/3 వంతు ప్రభుత్వం చెల్లిస్తుందని, తద్వారా అన్ని దవాఖానల్లో చికిత్సలు పొందే వీలుంటుందని తెలిపారు. అక్రిడిటేషన్లకు గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన వారికే అందజేస్తామని స్పష్టంచేశారు. ఈ సభలో నవ తెలంగాణ మాజీ ఎడిటర్, కవి, జర్నలిస్టు ప్రసేన్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సభ్యురాలు విమలక్క, రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్ యాదవ్, సాక్షి కార్టూనిస్టు శంకర్, చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళా శేఖర్ పాల్గొన్నారు.