రెండు జిల్లాల్లో 10 మంది ఆర్ఎంపీలపై కేసులు

రెండు జిల్లాల్లో 10 మంది ఆర్ఎంపీలపై కేసులు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఎలాంటి విద్యార్హతలు లేకుండా పది మంది ఆర్ఎంపీలు రోగులకు అల్లోపతి ట్రీట్​మెంట్ చేస్తుండగా తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​(టీఎంసీ) కేసులు నమోదు చేసింది. గురువారం సాయంత్రం మీడియాకు  టీఎంసీ వైస్​చైర్మన్ డాక్టర్​శ్రీనివాస్ వివరాలు తెలిపారు. బాన్స్​వాడ టౌన్​లో జాదవ్​సుదర్శన్, ఎం. పరమేశ్వర్​, గాంధారిలో కె.కస్తూరి అంజయ్య, ఎ. ఆంజనేయులు, కేతావత్​హేమ్​సింగ్​, నల్ల నరేందర్​పై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో  అడుల గణేష్​, రాజారామ్​, ఎండీ అజీమ్, అమానుల్లా ఖాన్​పై కేసులు పెట్టినట్టు ఆయన వెల్లడించారు.

టీఎంసీకి చెందిన డాక్టర్​సన్నీ డేవిస్​, డాక్టర్​శిరీష్​కుమార్, డాక్టర్​కిరణ్​కుమార్​, విజిలెన్స్​ ఆఫీసర్​రాకేష్​  చేపట్టిన తనిఖీల్లో రూల్స్​కు విరుద్ధంగా ఆర్ఎంపీలుగా చెలామణి అవుతూ ట్రీట్​మెంట్​చేస్తున్నట్టు, స్టెరాయిడ్స్​, పెయిన్​ కిల్లర్స్​, యాంటి  బయాటిక్​ మెడిసిన్స్​ పేషెంట్లకు ఇస్తున్నట్టు గుర్తించారు. గర్భిణులకు లింగ నిర్థారణ పరీక్షలు, అబార్షన్లు కూడా చేస్తున్నట్లు తేలింది. ప్రైవేట్​ఆస్పత్రుల్లో వార్డ్​బాయ్, ల్యాబ్​టెక్నిషియన్, కంపౌండర్లుగా పనిచేసి ఆర్ఎంపీలుగా చెలామణి అవుతున్నారని వివరించారు.  ఫేక్ డాక్టర్లపై 9154382727కు వాట్సాప్​ ద్వారా సమాచారం ఇవ్వాలని వైస్​ చైర్మన్ శ్రీనివాస్ కోరారు .