హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయినయ్‌

హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయినయ్‌

కరీంనగర్: జాతీయ స్థాయిలో కొట్లాడుకునే కాంగ్రెస్, బీజేపీ హుజురాబాద్‌లో కలిసి పోయాయి పని చేస్తన్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌ను ఓడించేందుకు ఆ రెండు పార్టీల నేతలు చీకట్లో షేక్‌ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు టీఆర్‌‌ఎస్‌లో చేరారు. జమ్మికుంట కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కె.వెంకన్న, డీసీసీ అధికార ప్రతినిధి సలీం, పలువురు కార్యకర్తలకు ఆయన టీఆర్‌‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌ అన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పింఛన్ రూ.600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రైతులకు బీమా రూ.5 లక్షలు ఇస్తున్నది ఒక సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటలు కరెంటు ఇస్తున్నది ఇస్తున్నది కూడా తెలంగాణలోనే అని చెప్పారు. ‘‘మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు తాము తెలంగాణలో కలుస్తమంటున్నరు. నిన్న కాక మొన్న కర్ణాటకలోని రాయచూరు ఎమ్మెల్యే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలిపితే బాగుంటుందన్నడు. అభివృద్ధిలో తెలంగాణ గొప్పగా ముందుకు సాగుతున్నందునే వాళ్లు ఆ విధంగా మెచ్చుకుంటున్నారు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పని చేస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో 8 గంటల నుంచి 12 గంటలకు పని గంటలు పెంచి శ్రమ దోపిడి చేస్తున్నారని హరీశ్‌ రావు ఆరోపించారు. బీజేపీ దళిత, గిరిజన, ముస్లిం, క్రిస్టియన్ల వ్యతిరేక పార్టీ అని అన్నారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సామాన్య ప్రజలకు గ్యాస్ బండ్‌ పెద్ద గుదిబండలా తయారైందని, ఈటలకు ఢిల్లీలో పలుకుబడి ఉంటే కేంద్రంతో మాట్లాడి.. వంట గ్యాస్ ధర తగ్గించాలని సవాలు విసిరారు.