- బీజేపీ, బీఆర్ఎస్వి కుమ్మక్కు రాజకీయాలు: పొన్నం ప్రభాకర్
- కాళేశ్వరంపై సీబీఐకి ఇస్తే.. సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారని ఫైర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సమీక్ష సమావేశం అనంతరతం మీడియాతో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో 20 టెండర్లు అప్పగించిందని.. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు పొందిన వాళ్లు కాంగ్రెస్ హయాంలో టెండర్లు దక్కించుకుంటే చెడ్డవాళ్లు ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు.
2014 నుంచి నేటి వరకు బొగ్గు గనుల కేటాయింపులపై బహిరంగ విచారణకు సిద్ధమని మంత్రి ప్రకటించారు. సీఎం విదేశీ పర్యటన తర్వాత గనుల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవ విషయాలను రాష్ట్ర ప్రజల ముందుంచుతామని చెప్పారు. విచారణ కోరుతున్న హరీశ్ రావు.. ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. బొగ్గు గనుల దర్యాప్తులో బీజేపీ సహకరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశపడుతున్నారని.. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఇస్తే.. కిషన్ రెడ్డి, హరీష్ రావు కలిసి సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైన్స్ కాంట్రాక్టులు ఎక్సెస్ లో ఇస్తున్నారని, తాము మైనస్ లో ఇచ్చామన్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 21 గనులు ఇస్తే.. ఒకటి మాత్రమే 0.1తో మైనస్ లో ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంతో అవినీతి జరిగినట్టు కవిత చెప్పారని.. ఆమె ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానం ఇవ్వలేదన్నారు. 2014 నుంచి సింగరేణిలో ఇచ్చిన ఒకే ఒక్క కాంట్రాక్ట్ మినహా.. మిగతా కాంట్రాక్టులన్నీ ఎక్స్‌ట్రాగానే ఇచ్చారని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, నా సవాల్ స్వీకరించే దమ్ముందా? అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని, రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సింగరేణి సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
