- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
ట్యాంక్ బండ్/కూకట్‌పల్లి, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా సోమవారం రాత్రి నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పాల్గొని ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ప్రధాని మోదీ మౌనం వీడి విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన కేసులను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. మరోవైపు కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఎన్ఎస్యూఐ జేఎన్టీయూ విభాగం ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.
జేఎన్టీయూ మెయిన్ గేట్ నుంచి ఫోరమ్ మాల్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో మంత్రి కొండా సురేఖ, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. పేపర్ లీకులతో విద్యార్థుల జీవితాలను కేంద్రం ఆగం చేస్తోందని మండిపడ్డారు.
