పాలేరుకు గోదావరి జలాలు..జవహర్ లిఫ్ట్ శంకుస్థాపన సభలో మంత్రులు 

పాలేరుకు గోదావరి జలాలు..జవహర్ లిఫ్ట్ శంకుస్థాపన సభలో మంత్రులు 

మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు. పాలేరుకు గోదావరి జిలాలు రానున్నాయని మంత్రులు తెలిపారు.  సభలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్​ కుమార్​ మాట్లాడారు. అనంతరం జిల్లా ఇన్​చార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ గత పదేండ్లపాటు పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను గత పాలకులు మోసం చేసిందన్నారు.

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందించిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని బియ్యంగా మార్చి పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.  వైద్య , విద్యా, వ్యవసాయ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు బలోపేతం చేయాలని కోరారు. 

ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడేండ్లలో డిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. భూ భారతితో పేద రైతులకు న్యాయం చేశామన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. రూ.1,200 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. వంగవీడుకు డబుల్ రోడ్ వేస్తామని హామీ ఇచ్చారు. 

జోన్ 3 ఆయకట్టు జోన్ 2 పరిధిలోకి తేవడం హ్యాపీ.. 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రూ.630 కోట్ల 30 లక్షలు ఖర్చు చేసి జవహర్ ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్​ తో సంబంధం లేకుండా జోన్ 3 ఆయకట్టు జోన్ 2 పరిధిలోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. గోదావరి నీటిని పాలేరు తీసుకొని వచ్చి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాల్లో రెండు పంటలు పండుతూ సస్యశ్యామలంగా పండించడం కోసం ఈ స్కీమ్​ ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడత కింద 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామని, రాబోయే 3 ఏండ్లపాటు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.

ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా డబ్బులు పడుతున్నాయని తెలిపారు. అంతకుముందు మదిరలోని ఇండోర్​ స్టేడియాన్ని మంత్రులు పరిశీలించారు. క్రీడాకారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సభలో జిల్లా కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఇరిగేషన్ సీఈ రమేశ్​ పాల్గొన్నారు.