కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

రాష్ట్రంలో 3స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మూడు స్థానాల్లో ఎన్నికలకు ఆయా జిల్లాల్లోని 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డిలో 8, నల్గొండలో 7, వరంగల్లో 10 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2 వేల 799 మంది ఓటు వేయనున్నారు. రంగారెడ్డిలో 811, నల్గొండలో వెయ్యి 86, వరంగల్లో 902 మంది ఓటర్లున్నారు.

ఇటీవల ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లకు మే 7న నోటిఫికేషన్ ఇచ్చింది ఈసీ. రంగారెడ్డి జిల్లాలో పట్నం నరేందర్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్లో కొండా మురళీ రాజీనామాతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. మూడు స్థానాలకు 36 నామినేషన్లు రాగా, 9 మంది బరిలో ఉన్నారు. నల్గొండ, రంగారెడ్డిలో ఇద్దరు చొప్పున, వరంగల్లో ఐదుగురు పోటీలో ఉన్నారు. రంగారెడ్డిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా కె.ప్రతాప్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మీ పోటీ చేస్తుండగా… గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక వరంగల్ నుంచి గులాబీ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎగనాల వెంకట్ రామ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.

2015 లో వరంగల్, నల్గొండ, రంగారెడ్డి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రంగారెడ్డి, వరంగల్ సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోగా… నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు 3 సీట్లను గెలవాలని గట్టి పట్టుదలగా ఉంది టీఆర్ఎస్. కాంగ్రెస్ మాత్రం సిట్టింగ్ సీటును నల్గొండను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో MPTC, ZPTC సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. దీంతో పార్టీలు తమ ఓటర్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించారు నేతలు. నామినేషన్లు ముగియగానే క్యాంప్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి.