- గత సర్కార్ హయాంలో పారదర్శకత లేదు: మహేశ్ కుమార్ గౌడ్
- వెల్ఫేర్ బోర్డూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- మండలిలో ప్రభుత్వానికి సభ్యుల వినతులు, డిమాండ్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని, నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా వెంటనే స్పెషల్ కమిటీని వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యుల నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి స్పెషల్ మెన్షన్స్, పిటిషన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఒక నిర్దిష్టమైన క్రైటీరియా పెట్టుకొని మలిదశ ఉద్యమకారులను గుర్తించాలన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలన్నారు. దీనిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘1969 ఉద్యమంలో పాల్గొన్న 3 వేల మంది జాబితా నా దగ్గరికి వస్తే గత ప్రభుత్వానికి రిఫర్ చేశా. అందులో 359 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయినవారే ఉన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మలిదశ ఉద్యమంలో కొంతమందిని గుర్తించారు. మిగతావారిలో జెన్యూనిటీ చూసి న్యాయం చేయాలి’’ అని సూచించారు.
హాస్పిటల్స్ లో సౌలతులు లేవ్: మధుసూదనాచారి
భూపాలపల్లి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో సౌలతులు లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. 200 బెడ్ల సామర్థ్యం ఉన్నా అధికారికంగా డిక్లేర్ చేయకపోవడంతో నిధులు రావడం లేదన్నారు. ఆటో కార్మికులకు ఇచ్చిన రూ. 12 వేల సాయం హామీని అమలు చేయాలని పిటిషన్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టినా లబ్ధి జరగలేదని, ప్రభుత్వం మారాక అకౌంట్లు ఫ్రీజ్ చేశారని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. వెంటనే గొర్రెల పంపిణీ చేపట్టాలని, 50 ఏండ్లు నిండిన యాదవ, కురుమలకు పెన్షన్లు, చనిపోతే రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.
అంబేద్కర్ విగ్రహంపై చిన్నచూపు వద్దు: దేశపతి
హైదరాబాద్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చే వారిని అనుమతించడం లేదని, దాని మెయింటెనెన్స్ గాలికొదిలేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. గత ప్రభుత్వం కట్టిందనే సంకుచిత ధోరణి వద్దని, అమరజ్యోతిని కూడా వెంటనే ఓపెన్ చేయాలని కోరారు. అలాగే, గ్రూప్స్ ఎగ్జామ్ నిర్వహణ లోపాల వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ మరో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మెయిన్స్ ఎవల్యూషన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో జరిగిందని చెప్పి, జేఎన్టీయూలో చేయించారని ఆర్టీఐలో తేలిందన్నారు. దీనిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని, జీవో 46 బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్‌కు సభ్యుల పిటిషన్లు..
మండలిలో స్పెషల్ మెన్షన్స్, పిటిషన్స్ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, గ్రామాల అకౌంట్లలోనే నేరుగా నిధులు వేయాలని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరగా.. జర్నలిస్టుల అక్రిడిటేషన్లను 23 వేల నుంచి 13 వేలకు తగ్గించొద్దని, వారికి హెల్త్ బెనిఫిట్స్ అందేలా చూడాలని వంటేరు యాదవ రెడ్డి, ఎల్.రమణ విజ్ఞప్తి చేశారు.
ఉస్మానియా వర్సిటీలో సౌకర్యాలపై కమిటీ వేయాలని వాణీదేవి, 2010కి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ తీర్మానం చేయాలని ఏవీఎన్ రెడ్డి, మోడల్ స్కూల్స్ టీచర్లకు ట్రెజరీ ద్వారా జీతాలివ్వాలని మల్క కొమరయ్య కోరారు. వృద్ధాప్య పింఛన్లలో ఒకరు చనిపోతే మరొకరికి ఆటోమెటిక్ గా పెన్షన్ వచ్చేలా చూడాలని భానుప్రసాద్ రావు కోరారు.
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల జీతాలు రూ.15 వేలకు పెంచాలని, నవీన్ కుమార్ రెడ్డి, ఐటీడీఏలకు పూర్వ వైభవం తేవాలని శంకర్ నాయక్ కోరారు. వరంగల్ లో కొత్త జైలు నిర్మించాలని బస్వరాజు సారయ్య విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని రమణ కోరగా.. సభ్యుల వినతులను మంత్రి వివేక్ వెంకటస్వామి నోట్ చేసుకున్నారు.
యాదాద్రిలో స్కామ్.. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలి: తీన్మార్ మల్లన్న
యాదాద్రి టెంపుల్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ అధికారి ద్వారా రూ.1,300 కోట్ల టెండర్లు పిలిచారని, కాంట్రాక్ట్ సంస్థలు తక్కువకే చేస్తామని చెప్పినా.. అధికారులు మాత్రం వాళ్లకు కోట్లు ముట్టజెప్పారని మండిపడ్డారు.
దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,700 ఫిషరీస్ సొసైటీలకు రెండేండ్ల నుంచి ఎన్నికలు జరగలేదని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు.
సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయండి: గోరటి వెంకన్న
రెండేండ్ల నుంచి సాహిత్య అకాడమీ ఊసే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కళాకారులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీతమే ఇస్తున్నారని, అది కూడా రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసి, కళాకారులకు నెలనెలా జీతాలు ఇవ్వాలని, సంచార జాతుల కళాకారులకు సామాజిక హోదా కల్పించాలని కోరారు.
