
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికల రిజల్ట్స్ శనివారం వెలువడనున్నాయి. మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులు, కార్పొరేషన్లలోని 324 డివిజన్లలో పోటీపడ్డ 12,898 క్యాండిడేట్ల భవితవ్యం కొద్దిగంటల్లో తేలిపోనుంది. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. చాలా మున్సిపాలిటీల్లో మధ్యాహ్నంకల్లా రిజల్ట్స్ తేలిపోయే అవకాశం ఉంది. పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రం సాయంత్రానికి స్పష్టత రానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 24 వార్డులు అంతకంటే ఎక్కువ ఉన్న మున్సిపాలిటీల్లో వార్డుకు ఒక కౌంటింగ్ టేబుల్, తక్కువున్న చోట రెండు వార్డులకో టేబుల్ చొప్పున సిద్ధం చేశారు. మొత్తంగా చూస్తే ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు వాడిన నేపథ్యంలో లెక్కింపు కొంత ఆలస్యంగా జరుగనుంది.
కౌంటింగ్ ఇట్లా..
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అన్ని ఏర్పాట్లు చేశాక ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత బ్యాలెట్‌బాక్సులను ఓపెన్ చేస్తారు. మున్సిపాలిటీల్లో సగటున ప్రతి వార్డుకు రెండు పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో వార్డుకు సంబంధించిన ఓట్లను ఒకేచోట కలిపి.. బండిళ్లుగా కడతారు. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి గంటసేపు పట్టే చాన్స్ ఉంది. తర్వాత క్యాండిడేట్ల వారీగా ఓట్లను విడదీసి లెక్కిస్తారు. సగటున ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 ఓట్లు పోలై ఉంటే.. లెక్కించేందుకు మూడు గంటల టైం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకంటే తక్కువుంటే రెండు గంటల్లోనే లెక్కింపు పూర్తి కానుంది. ఓట్ల కౌంటింగ్‌లో ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి మూడు టేబుళ్లను ఒక రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. వార్డుల వారీగా లెక్కింపు పూర్తయిన కొద్దీ రిజల్ట్‌ను ప్రకటిస్తారు.
తొలి ఫలితం 11 గంటలకే..
కొత్తగా ఏర్పాటైన చండూరు, భూత్పూర్ అమరచింత, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 10 చొప్పున వార్డులున్నాయి. వీటితోపాటు 12 వార్డులే ఉన్న రామాయంపేట, చేర్యాల, హాలియా, నందికొండ, ఆలేరు, యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి వంటి మున్సిపాలిటీల ఫలితాలు ఉదయం పదకొండు, పన్నెండు గంటల వరకే వెల్లడయ్యే అవకాశముంది. ఇక ఏకంగా 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్లో కౌంటింగ్ పూర్తయ్యేందుకు ఆలస్యం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎక్కడైనా ఇద్దరు క్యాండిడేట్లకు సమానంగా ఓట్లు వస్తే వారి సమక్షంలోనే డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు.
కౌంటింగ్ చేసేదిట్లా..
- ఒక్కో మున్సిపాలిటీలో అన్ని వార్డుల కౌంటింగ్‌కు ఒకే పెద్ద హాల్లో కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి. క్యాండిడేట్లు, వారి ఏజెంట్లకు స్పష్టంగా కనిపించేలా టేబుల్స్‌ను ఏర్పాటు చేసి.. సేఫ్టీ కోసం చుట్టూ జాలీ అమర్చుతారు. ఒక్కో వార్డుకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లను కలిపేస్తారు. ఇందుకోసం డ్రమ్ములను, ప్లాస్టిక్టబ్లను ఉపయోగిస్తారు.
- ఓట్లన్నింటినీ 25 చొప్పున కట్టలుగా చేసి రబ్బర్‌బ్యాండ్లు వేస్తారు. చివరగా మిగిలిన ఓట్లను కూడా కట్టగట్టి వాటి సంఖ్యను పెన్సిల్‌తో రాసిపెడతారు. ఈ కట్టల్లోంచి ర్యాండమ్‌గా నాలుగు చొప్పున తీసి.. వంద ఓట్ల కట్టలుగా కట్టి, పెద్ద ట్రేలో పెడతారు. వార్డు పరిధిలోని అన్ని ఓట్లను కట్టలు కట్టాక కౌంటింగ్ మొదలుపెడ్తారు.
- ప్రతి కౌంటింగ్ టేబుల్‌పై ఆయా క్యాండిడేట్ల గుర్తులుండే ట్రేలు ఉంటాయి. సిబ్బంది వంద ఓట్లుండే ఒక్కో కట్టను విప్పి, ప్రతి ఓటును ఏజెంట్లకు చూపిస్తూ.. ఆయా క్యాండిడేట్లకు సంబంధించిన ట్రేలలో వేస్తారు. చెల్లని, సరిగా లేని ఓట్లను ‘డౌట్ఫుల్’ ట్రేలో వేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ వాటిని పరిశీలించి ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు.
- మొత్తం ఓట్లన్నింటినీ గుర్తుల వారీగా ట్రేలలో వేశాక.. క్యాండిడేట్ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. మొత్తం పోలైన ఓట్లను, లెక్కించిన ఓట్ల సంఖ్యను సరిచూస్తారు. చివరిగా ఏ క్యాండిడేట్‌కు ఎన్ని ఓట్లు వచ్చింది వివరాలు, ఫైనల్ రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు.
- మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్లోకి క్యాండిడేట్లను, ఒక్కో ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు.